- నేపాల్ విలయం వేళ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ సందేశం
ఖాట్మండు : జల ప్రళయంలో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంతో నేపాల్ కుదేలైన నేపథ్యంలో మానవతా సాయం పేరుతో భారత్, చైనా సహా పలు దేశాలు సహాయ, సహకారాలను అందిస్తున్నాయి. కాగా దీన్ని సాయం, ఉదారత అని పిలవడం ఆపాలని, వాతావరణ మార్పుల వల్ల నేపాల్‌కు జరిగిన నష్టానికి ప్రపంచ దేశాలు చెల్లించే నష్టపరిహారమని పిలవాలని వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ పేర్కొన్నారు. నష్టపరిహారం నేపాల్‌కు చెల్లించాలంటూ నేపాల్ ప్రభుత్వం చేసిన డిమాండ్‌ను సమర్ధించారు. ప్రాణాంతకమైన రీతిలో హిమనీ నదాలు విరిగిపడడంతో సంభవించిన మెరుపు వరదల్లో మరణించిన వారి సంఖ్య శనివారానికి 1344కి పెరిగింది. 5వేల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ పరిస్థితులకు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలు, శిలాజ ఇంధన కంపెనీలు కూడా సమానంగా బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. నేపాల్‌కు సాయంమందించాలా లేదా, ఇస్తే ఎంత ఇవ్వాలి అనే అంశాలు సంపన్న దేశాలు నిర్ణయించడం కాదు, ఇదేమీ వారికిచ్చే బహుమతి అంతకంటే కాదు, మీ వల్ల జరిగిన నష్టానికి మీరిచ్చే నష్టపరిహారం అంతేనని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
ఈ హిమాలయ పెను విషాదం అంతుచిక్కనిదని, దీన్ని కేవలం ప్రకృతి వైపరీత్యంగా పరిగణించరాదని ఆమె పేర్కొన్నారు. అపారమైన లాభాలు సంపాదించుకునేందుకు శిలాజ ఇంధనాలను తవ్వి తీసి, అమ్ముకుంటున్న అభివృద్ధి చెందిన దేశాలు వెలువరించే కాలుష్య ఉద్గారాల వల్లనే ఈ విపత్తు సంభవించిందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచం సృష్టిస్తున్న కాలుష్యాన్ని తన వంతుగా కొంత మేరా ప్రక్షాళన చేస్తున్న నేపాల్, తనలాగే ప్రపంచ సంపన్న దేశాలు కూడా వ్యవహరించాలని కోరుతోందని అన్నారు.








కామెంట్‌లు (0)