- గత పదేళ్ళో 30శాతం పెంపు
- ఐఐటి-మండి పరిశోధనలో వెల్లడి
మండి : హిమాలయ పర్వత సానువుల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో నీటి బాంబుల జాడ పెరుగుతోందని, ఇవి ఎప్పుడైనా జనావాసాలపై పడే ప్రమాదం పొంచి వుందని ఐఐటి మండి అధ్యయనంలో వెల్లడైంది. హిమనీ నదాలతో ఏర్పడిన సరస్సులు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొంటూ అలాంటివాటిని తొమ్మిదింటిని ఐఐటి మండికి చెందిన పరిశోధకులు గుర్తించారు. నేపాల్‌లో సంభవించిన జల విలయం నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సరస్సులు పర్వత వాలులోని జనావాస ప్రాంతాలకూ ఎప్పడూ తీవ్రమైన ముప్పుగానే వుంటాయని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అత్యంత వేగంగా కరుగుతున్న హిమనీ నదాలు ఇందుకు మరింత దోహదపడుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఇతర డేటా బేస్‌లను విశ్లేషించిన మీదట హిమాలయ ప్రాంతంలో హిమనీ నదాల సరస్సులు గత దశాబ్ద కాలంలో దాదాపుగా 30శాతం పెరిగాయి. వాటి పరిమాణం కూడా గణనీయంగా విస్తరించింది. దీంతో ఇవి ఎప్సుడైనా నీటి బాంబుల్లా జనావాసాల మీదకు విరుచుకుపడే ప్రమాదముందని ఆరుగురు సభ్యులతో కూడిన పరిశోధక బృందం హెచ్చరించింది. అత్యంత ఎత్తైన చంబా, లాహుల్ స్పితి ప్రాంతాల్లో వున్న అటువంటి సరస్సులు 9ని గుర్తించామని బృందం ఛైర్‌పర్సన్, స్కూల్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డెరిక్స్ పి.శుక్లా తెలిపారు. కొండచరియలు విరిగిపడడం, భూకంపం, భారీ వర్షాలు వంటి సందర్భాల్లో ఇవి కట్టలు తెంచుకుని ఊర్లపై పడే ముప్పు పొంచి వుందన్నారు. ఈ సరస్సుల పరిధిలో 15కి పైగా వంతెనలు, అనేక జనావాసాలు, విద్యా, ఆరోగ్య సంరక్షణ సంస్థలు వున్నాయని ఆ అధ్యయనం హెచ్చరించింది. కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి), జాతీయ విపత్తు నిర్వహణా అథారిటీ (ఎన్‌డిఎంఎ)లతో సహా ప్రభుత్వ సంస్థలు హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు సరస్సులను సున్నితమైనవిగా వర్గీకరించాయి. అందులో మూడు ఐఐటి మండి పరిశోధనలో కూడా ప్రస్తావించబడ్డాయి.







కామెంట్‌లు (0)