కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం
హైదరాబాద్ : కృత్రిమ మేధస్సు (ఏఐ), డీప్‌ఫేక్ వీడియోల దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. నటీనటులు, కళాకారుల వ్యక్తిగత గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని చిరంజీవి తెలిపారు. అమిత్ షా సూచన మేరకు కేంద్ర హోంశాఖ, సమాచార, ప్రసార శాఖలకు ఉద్దేశించిన వినతిపత్రాన్ని కిషన్ రెడ్డికి అందించినట్లు వెల్లడించారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏఐ, డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి కొందరు దుండగులు నటీనటులు, కళాకారుల ముఖాలతో అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల వ్యక్తుల గౌరవానికి భంగం కలగడంతో పాటు, నటీనటుల హక్కులు, వారి సృజనాత్మక కంటెంట్‌కు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్‌లు, డిజిటల్ ఇంపర్సనేషన్ వంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కళాకారుల గౌరవం, సృజనాత్మక హక్కులను కాపాడటంతో పాటు ప్రతి పౌరుడి భద్రతకు భరోసా కల్పించడం సమష్టి బాధ్యతని చిరంజీవి స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)