- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చిత్తూరు జిల్లా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధారల కింద రూ. 2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్ స్కీమ్ పనుల పురోగతిపై సోమవారం సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్‌లైన్ నిర్మాణం కోసం వివిధ శాఖల నుంచి పొందాల్సిన అనుమతులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్ రెండవ విడతలో దాదాపు రూ. 26,000 కోట్ల విలువ చేసే తాగునీటి ప్రాజెక్టులను ముందుకు చేపట్టినట్లు తెలిపారు. అందులో మొదటి విడతగా రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల పరిధిలో చేపట్టిన ఐదు మెగా వాటర్ గ్రిడ్ పథకాల్లో చిత్తూరు కూడా ఒకటిగా ఉందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించేందుకు జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో రూ. 2,370 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్ఠాత్మక తాగునీటి సరఫరా పనులు చేపట్టామన్నారు. గండికోట, వెలిగల్లు జలాశయాలను నీటి వనరులుగా వినియోగిస్తూ అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లో ఉన్న 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించనున్నారు. సుమారు 25 లక్షల మంది ప్రజలు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. చిత్తూరు మల్టీ విలేజ్ తాగునీటి పథకానికి సంబంధించి గండికోట వద్ద నిర్మాణం చేపట్టిన ఒక ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, నాలుగు రా వాటర్ సంపులు నిర్మించాల్సి ఉండగా, అందులో మూడు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, గుర్రంకొండ వద్ద 75 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఒక నీటి శుద్ధి కేంద్రం, వెలిగల్లు వద్ద 26 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో మరో నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఏడు నీటి సంపులు, ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు, 14 గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర 167 పనులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 130 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం కూడా పూర్తయ్యిందని వెల్లడించారు.








కామెంట్‌లు (0)