- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డుల సభలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. స్వచ్ఛత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని చెప్పారు. ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లోకి వ్యర్థాలు, మురుగునీటిని వదిలేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దిగువ ప్రాంతాల్లో ప్రజలు నదుల నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారని తెలిపారు. పర్యావరణానికి నష్టం చేసే చర్యల వల్లే ఎల్నినో లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. రూ.50 వేల కోట్లతో జల్జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్ధికి రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ స్వాతంత్ర్యం పోరాటంతో పాటు... స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఆరోగ్యం కోసం ఎవరి పరిసరాలను వారే శుభ్రంగా ఉంచుకోవాలన్నదే గాంధీజీ సందేశమని చెప్పారు. చెత్తను సమస్యగా చూడకుండా సంపద సృష్టించే వనరుగా మార్చుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. జీరో గార్బేజ్ లక్ష్యంతో ఇ–ఆటోలు, పుష్కార్టులు, మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ యంత్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఏడాది అక్టోబరు 2న నెట్జీరో, స్వచ్ఛతపై పనిచేసిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందించే కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా 22 విభాగాల్లో 130 రాష్ట్రస్థాయి అవార్డులు, 2,044 జిల్లా స్థాయి అవార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 12 వేల మంది క్రీడాకారులు, రన్నర్లు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు. . తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)