మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రైవేటుపై అదే మాట!

2 గంటల క్రితం

CBN
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 12:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • పిపిపి విధానాన్ని జోరుగా కొనసాగిస్తామన్న సిఎం చంద్రబాబు

  • విలేకరుల సమావేశంలో ఆర్థికశాఖపై ప్రగతి నివేదిక విడుదల

అమరావతి - ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాల నుండి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆ విధానాలనే మరింతగా ముందుకు తీసుకుపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపి కూటమి పాలనకు రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆయన ఆర్థికశాఖపై ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో సిఎం మాట్లాడుతూ పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని ప్రస్తావించారు. ‘చాలామంది దీనిని వద్దంటున్నారు. అయినా, తాము ఆ విధానంలోనే కొనసాగుతామని’ చెప్పారు. పిపిపి విధానంలో ప్రజల సంపద దోపిడీకి గురవుతుందని, లాభాలే లక్ష్యంగా కార్పొరేట్లు పనిచేస్తారంటూ ఆర్థిక రంగ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలకు భిన్నంగా ఆ విధానంలో ప్రభుత్వానికి మేలు జరుగుతుందని సిఎం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి పిపిపి విధానం తప్పనిసరి అని, దానితోనే ముందుకు పోతామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని వీటిలో రూ. 11.37 లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటిలో అధికభాగం పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టినవేనని అన్నారు. దీనికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు, కేంద్ర ప్రభుత్వం నుండి దీనికి సహకారం లభిస్తున్నట్లు తెలిపారు. ‘ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. కొన్ని విషయాల్లో చెప్పిన వాటికన్నా ఎక్కువే చేస్తున్నాం’ అని అన్నారు. కేవలం సంక్షేమం అందిస్తే సరిపోదని, ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించాలని, ఆ దిశలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటి వరకు ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని, తాజాగా ఆర్థికశాఖపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నామని తెలిపారు. తాము చేయాల్సిన పనులు కూడా ఇంకా చాలా ఉన్నట్లు చెప్పారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, రాజధాని నిర్మాణం, విశాఖ, అమరావతి, రాయలసీమ ఆర్ధిక కారిడార్ల నిర్మాణ పనులను ఆయన ప్రస్తావించారు. రోడ్లు, ఓడరేవులు, రైల్, ఎయిర్‌‌పోర్టుల నిర్మాణంపై కూడా దృష్టి సారించాల్సి ఉందని అన్నారు.

ఈ సమావేశంలో సమైక్య రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను, ఆ తరువాత 2019 నుంచి 2024 మధ్య కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తాము చేపట్టిన చర్యలను సిఎం వివరించారు. ఇదే సమయంలో అప్పులను భారీగా తగ్గిస్తూ అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులో ఉండేలా చూశామని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు భయంతో జీవనం సాగించారని అన్నారు. ఒక ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ఒక ఉదాహరణ అని అన్నారు.

2019 తరువాత ఆర్థికంగా నష్టపోయాం..

2014 లో విభజన తర్వాత రాష్ట్రం వ్యవసాయ అధారితంగా మారిపోయిందని, 58 శాతం మంది జనాభా ఉంటే 46 శాతమే వనరులు ఉన్నాయని చెప్పారు. ఇక 2019 తర్వాత రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ఆర్ధికంగా నష్టపోయామని అన్నారు. ఆ కాలంలో వ్యవస్థలు కుప్ప కూలాయని, శాంతి భద్రతలు లేకుండా పోయాయని, రాష్ట్ర బ్రాండ్‌ ‌దెబ్బతిందని, పరిశ్రమలు పారిపోయాయని అన్నారు. ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆదాయం రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడులు రావాలని, దానికోసమే ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం 95,231గా ఉందని, విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.93,903కు పడిపోయిందన్నారు. అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగినందువల్లే ఏపీ, తెలంగాణల మధ్య రిసోర్స్ గ్యాప్ 10 నుంచి 8 శాతానికి తీసుకురాగలిగామని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో జీఎస్‌‌డిపి వృద్ధి రాష్ట్రంలో 13.50 శాతంగా ఉంటే తెలంగాణలో 13.70 శాతంగా ఉందని, 2019-24 మధ్య కాలంలో ఇదే జిఎస్‌‌డిపి గ్రోత్ రాష్ట్రంలో 10.30 శాతానికి పడిపోగా, తెలంగాణ 11.40 శాతంగా ఉన్నట్టు చెబుతూ 2024-26 లో ఇది 11.30 శాతానికి చేరుకుందని అన్నారు. 2014–19లో ఉన్న వృద్ధిరేటును కొనసాగించి ఉంటే రాష్ట్రానికి అదనంగా రూ.6.94 లక్షల కోట్ల జిఎస్‌‌డిపి వచ్చేదని అన్నారు. దీనివల్ల ఆదాయం పెరిగి రెవెన్యూ అప్పులు చేసే పరిస్థితి తప్పేదన్నారు.

​మార్చిలో పోలవరం జాతికి అంకితం

తాజాగా అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతున్నట్టు చంద్రబాబు చెప్పారు. పోలవరం పనులు 72 శాతం వరకు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది మార్చిలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నామని తెలిపారు. నాలుగు విమానాశ్రయాల విస్తరణ చేపడుతూ మరో రెండు కొత్త విమానాశ్రయాల పనులు ప్రారంభించామన్నారు. మూడు ఓడరేవుల పనులకు శ్రీకారం చుట్టామని, రహదారి నెట్‌వర్క్‌లో 4,387 కి.మీ. విస్తరణ, కియా, ఏషియన్ పెయింట్స్, ఇసుజు, ఫాక్స్‌కాన్ వంటి భారీ పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల పనులు ప్రారంభించామన్నారు. గత రెండేళ్ల కాలంలో అమరావతి కోసం 10 వేల కోట్లు, పోలవరానికి 8,300 కోట్లు, పోర్టులకు 5437 కోట్లు, జల్ జీవన్ మిషన్‌కు 1,142 కోట్లు, ఎయిర్ పోర్టులకు 2,302 కోట్లు, రోడ్ నెట్ వర్క్ కోసం రూ.3,439 కోట్లు ఖర్చు పెట్టామని, ఇవి కాకుండా జాతీయ రహదారుల కోసం ఇప్పటి వరకు రూ.38,800 కోట్లు, రైల్వేల కోసం రూ.64,417 కోట్లను కేంద్రం రాష్ట్రంలో ఖర్చు పెట్టిందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్