అమెరికా ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు
టెహ్రాన్, వాషింగ్టన్ : అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయమై మంగళ లేదా బుధవారాల్లో అమెరికా, ఇరాన్‌లు ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు వున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. సిఎన్‌బిసికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇరాన్‌తో మాట్లాడుతున్నామని చెప్పారు. టోల్ విధించడానికి ఇరాన్‌ను అనుమతిస్తున్నారా లేదా అని ప్రశ్నించగా, ఇది స్వేచ్ఛగా రాకపోకలకు సంబంధించిన అంశమే అవుతుందని వ్యాఖ్యానించారు.
అమెరికా ఆర్థిక మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా ముడి చమురు బారెల్‌కు 78డాలర్ల కన్నా దిగువకు పడిపోయింది. పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వందలాది నౌకలు గనక ముందుకు కదలగలిగితే ధరలు ఇంకా పడిపోతాయని బెసెంట్ వ్యాఖ్యానించారు. కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, శుద్ధి చేయబడిన ఉత్పత్తులు, వివిధ పారిశ్రామిక గ్యాస్‌ల ధరలు కూడా తగ్గుతాయని అన్నారు. ఆ ధరలు తగ్గితే వాణిజ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపశమనం కలుగుతుందన్నారు. హర్మూజ్‌పై తిరిగి చర్చలు ప్రారంభమయ్యేందుకు వీలుగా ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు జరపాలన్న ఆలోచన విరమించకున్నామని శనివారం ట్రంప్ వ్యాఖ్యానించారు.







కామెంట్‌లు (0)