మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పోరాడే శక్తులకు స్ఫూర్తి కాక్రోచ్‌ ఉద్యమం

01 ఆగస్టు, 2026

mvs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 11:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ‘విద్యార్థుల దేశ వ్యాప్త ఉద్యమం-విశ్లేషణ’ సదస్సులో ఎంవిఎస్‌ శర్మ

ప్రజాశక్తి-గుంటూరు : రాజ్యాంగాన్ని గౌరవించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తనకు ఎదురు లేదనుకున్న కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్‌ ఉద్యమం గట్టి గుణపాఠం అని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ ‌శర్మ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ ఈ ఉద్యమం స్ఫూర్తిగా నిలవాలని, అందుకోసం ప్రజాస్వామ్య, అభ్యుదయ శక్తులు కృషి చేయాలని కోరారు. ‘విద్యార్థుల దేశ వ్యాప్త ఉద్యమం-విశ్లేషణ’ అనే అంశంపై ఆలిండియా లాయర్స్‌ ‌యూనియన్‌, మధ్యతరగతి ఫోరం ఆధ్వర్యంలో స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ ‌సమావేశ మందిరంలో శనివారం సెమినార్ నిర్వహించారు. ఐలు రాష్ర్ట కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సెమినార్‌‌కు ముఖ్య వక్తగా హాజరైన శర్మ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా దేశంలో అమలవుతున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ దుష్పలితాలపై యువత అంతరంగంలో గూడుకట్టుకున్న వ్యతిరేకత నీట్‌ ‌ప్రశ్నా పత్రం లీక్‌ ‌నేపథ్యంలో బయటకు వచ్చిందన్నారు. ఈ ఉద్యమం దేశానికి అనేక పాఠాలు నేర్పిందని, మోడీ, అమిత్‌‌షాకు తిరుగులేదన్న అభిప్రాయం తప్పని ఈ ఉద్యమం నిరూపించిందని వివరించారు. మరోవైపు పోలీసులు నిబంధనలు తుంగలో తొక్కి కర్కశంగా వ్యవహరించారని, అసాంఘిక శక్తులు పోలీసుల రూపంలో విద్యార్థులపై దాడులకు పాల్పడ్డాయని విమర్శించారు. ఈ ఉద్యమం ఢిల్లీకే పరిమితం కాలేదని, దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని యువత ఈ సందర్భంగా వెలుగెత్తి చాటిందని, రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. మోడీ కరుణ కోసం రాష్ర్టంలో టిడిపి, వైసిపి, జనసేన పోటీ పడుతున్నాయని, కాక్రోచ్‌ ఉద్యమం తర్వాత కూడా మోడీని పిలిచి సభ పెట్టడం దురదృష్టకరమన్నారు. ఐలు రాష్ర్ట కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ... అసమ్మతిని తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి మౌలిక లక్షణం అని అన్నారు. అటువంటి హక్కులను అణచివేస్తే ఇదే విధంగా ఉద్యమాలు వస్తాయని పేర్కొన్నారు. సెమినార్‌‌లో బిఇఎఫ్‌ఐ నాయకులు సాంబశివరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్