గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీటి భద్రత, అభివృద్ధి, సుపరిపాలనపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 11:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 8వ కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో నీటి భద్రత, అభివృద్ధి, సుపరిపాలనపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. 8వ కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. గతేడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో 85 శాతం నీటి నిల్వలు ఉండగా, ప్రస్తుతం 57 శాతం మాత్రమే ఉన్నాయని సీఎం తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు పూర్తికాలేదని విమర్శించారు. కేంద్ర ప్రాయోజిత పథకం జల్‌ జీవన్‌ మిషన్‌ను గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేదన్నారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి రాజీ ఉండకూడదని, సంక్షోభ సమయంలో కలెక్టర్ల నాయకత్వ సామర్థ్యం బయటపడాలని సూచించారు.

ప్రతి జిల్లాలో 25 టాప్‌ ప్రాజెక్టులు, ప్రతి నియోజకవర్గంలో 10–15 ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించి అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా గ్రోత్‌ ఇంజన్లను గుర్తించి సంపద, ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలన్నారు. కోనసీమ కొబ్బరి, వరి పంటలకు ప్రసిద్ధి అయినప్పటికీ ఆదాయంలో వెనుకబడిందని, కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. అవకాశాలను అందిపుచ్చుకున్న ఏలూరు జిల్లా అత్యుత్తమ జిల్లాగా మారిందని పేర్కొన్నారు. రెస్పాన్సివ్‌ గవర్నెన్స్‌ ద్వారా సుపరిపాలన అందించాలని చంద్రబాబు అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని సమస్యల పరిష్కారానికి వేగంగా స్పందించాలని కోరారు. తమ పదవీకాలంలో జిల్లాలకు చేసిన పనులను కలెక్టర్లు గర్వంగా చెప్పుకునేలా పనిచేయాలన్నారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేపడుతున్నామని, 120 ఏళ్ల నాటి భూ సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని తెలిపారు. అమలాపురంలో 1908 నుంచి ఉన్న గ్రౌండ్‌ రెంట్‌ భూముల సమస్యపై నిర్ణయం తీసుకుని 1,416 మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. 2027 నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని అన్నారు.

ఫేక్‌ ప్రచారంపై వేగంగా స్పందించాలి

ఫేక్‌ ప్రచారంతో కొందరు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారంపై అధికారులు వేగంగా స్పందిస్తే వాస్తవాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంటుందన్నారు. ఆలస్యంగా స్పందిస్తే దాని ప్రభావం ప్రభుత్వంపైనే పడుతుందని హెచ్చరించారు. డీఎస్సీలో ఎక్కడా తప్పు జరగలేదని, స్పోర్ట్స్‌ కోటాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఈ అంశంపై సమర్థంగా స్పందించిన ఇద్దరు మహిళా అధికారులను అభినందించారు. ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విజయవాడలోని కొండారెడ్డి బురుజు, అంబేద్కర్‌ విగ్రహం వద్ద, విశాఖ బీచ్‌ రోడ్డులో నిరసనలు చేపట్టారని సీఎం పేర్కొన్నారు. అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉత్తరాంధ్ర ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. పరిపాలన కంటే సుపరిపాలనకే ప్రాధాన్యత ఇస్తానని, కలెక్టర్లు పనితీరులో పోటీ పడాలని సూచించారు.

రివ్యూల నుంచి రిజల్ట్స్‌ వైపు మారాలి

బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ను అనుసరించి, ప్రభుత్వ సేవలను సులభతరం చేసే ఉత్తమ విధానాలను తీసుకురావాలని చంద్రబాబు అన్నారు. “వన్‌ స్టేట్‌–వన్‌ మిషన్‌–వన్‌ ఎయిమ్‌” లక్ష్యంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13.44 శాతం వృద్ధి నమోదైందని, దీనిని 15 శాతం దిశగా తీసుకెళ్లాలని కలెక్టర్లకు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్