దాదాపు రూ.48 లక్షలకు పైగా నష్టం
30 బైకులు, ప్లైవుడ్, గ్లాస్ సామగ్రి పూర్తిగా దగ్ధం
ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుల వేడుకోలు
ప్రజాశక్తి- పులివెందుల రూరల్: పులివెందుల పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అంబకపల్లి రోడ్డులో ఉన్న మూడు దుకాణాల్లో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్ బైక్ వరల్డ్, షా ప్లైవుడ్ ఎంటర్‌ప్రైజెస్, ఎంఎస్ గ్లాస్ షాపుల్లో మంటలు చెలరేగడంతో దుకాణాల్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. బాధితుల వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో దాదాపు రూ.48 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. బుధవారం రాత్రి వ్యాపారాలు ముగించుకుని మూడు దుకాణాల యజమానులు ఇళ్లకు వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో దుకాణాల నుంచి మంటలు వస్తున్నాయని సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సునీల్‌కుమార్ సిబ్బందితో కలిసి ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. తొలుత బైక్ షాపులో మంటలు చెలరేగడంతో పెట్రోల్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో వేంపల్లి, సమీపంలోని యూసీఎల్ నుంచి కూడా ఫైర్ ఇంజన్లను రప్పించారు. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో బైక్ షాపులో ఉన్న సుమారు 30 బైకులు, బైక్ విడిభాగాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. అలాగే ప్లైవుడ్, గ్లాస్ దుకాణాల్లోని వస్తువులు కూడా మంటలకు ఆహుతయ్యాయి. దీంతో బాధితులకు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారి (ఆర్‌ఐ) షేక్ షావల్లి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన దుకాణాలను పరిశీలించారు. నష్టంపై వివరాలను సేకరించారు.
ప్రభుత్వం ఆదుకోవాలి: షేక్ శామీర్ బాషా
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో తన షాపులో ఉన్న సుమారు 30 బైకులతో పాటు బైక్ సామగ్రి పూర్తిగా దగ్ధమైందని బైక్ వరల్డ్ యజమాని షేక్ శామీర్ బాషా తెలిపారు. సుమారు రూ.25 లక్షల మేర నష్టం వాటిల్లిందని, మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు ఈ నష్టం తీవ్ర ఇబ్బందులు కలిగించిందన్నారు. కస్టమర్ల బైకులకు జరిగిన నష్టాన్ని తాను ఎలా భరించగలనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
రూ.20 లక్షల పరిహారం అందించాలి: షేక్ బాబావల్లి
ప్లైవుడ్ షాపులో గృహ నిర్మాణాలకు సంబంధించిన సుమారు రూ.20 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైందని షా ఎంటర్‌ప్రైజెస్ యజమాని షేక్ బాబావల్లి తెలిపారు. వడ్డీకి అప్పు తీసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నానని, అగ్ని ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి కనీసం రూ.20 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.










కామెంట్‌లు (0)