గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆలయ భూముల కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ

08 అక్టోబర్, 2026

ఆలయ భూముల కౌలు రైతుల 
సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ 
- ఎపి కౌలు రైతు సంఘం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 09:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎపి కౌలు రైతు సంఘం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆలయ భూములు సాగుచేసే కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ హామీ ఇచ్చారు. బుధవారం విజయవాడలో జరిగిన కౌలు రైతుల రాష్ట్ర సదస్సు తీర్మానాలను కమిషనరుకు వినతిపత్రం రూపంలో సమర్పించారు. కరువు ప్రాంతాల్లో ముందస్తు కౌలు చెల్లించిన ఆలయ భూమి కౌలు రైతులకు ఏడాది ఉచితంగా అదే భూమిని సాగు చేసుకోవడానికి అనుమతినివ్వాలని కౌలు రైతు సంఘం నాయకులు కోరారు. ముందస్తు కౌలు చెల్లించే పద్ధతిని కూడా విరమించి పంట వచ్చిన తర్వాతే కౌలు వసూలు చేసే పద్ధతిని పునరుద్ధరించాలని కోరారు. అలాగే పేదవారికి ల్యాండ్ లెస్ పూర్ సర్టిఫికెట్‌ని పునరుద్ధరించి వేలం పాటలు లేకుండా సాగు చేసుకోవడానికి అనుమతినివ్వాలని కోరారు. ఆలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డు ఇచ్చే అంశంపై అన్ని ఆలయాలు కార్యనిర్వహణ అధికారులకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ భూములు ఆక్రమణకు గురైతే వాటిని విడగొట్టి రక్షణ కల్పించాలన్నారు. 22 ఏ కింద పెట్టిన ఆలయ భూములను ఫ్రీ హోల్డ్ చేసి సాగుదారులను ఆదుకోవాలని, ప్రతి ఆలయం వద్ద సాగుదారుల పేర్లు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్‌‌ను కలిసిన ప్రతినిధి బృందంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి బలరాం, ఎం హరిబాబు, ఆలయ భూముల కౌలు రైతు సంఘం కన్వీనర్ వై రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నూతన కన్వీనర్‌గా వై రాధాకృష్ణ

ఆంధ్రప్రదేశ్ దేవాలయ భూముల కౌలుదారులు, సాగు రైతు సంఘం రాష్ట్ర కమిటీ కన్వీనర్‌గా వై రాధాకృష్ణను విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఎన్నుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన మరో 20 మందికి ఈ కమిటీలో అవకాశం లభించింది. అనంతరం కమిటీ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించింది. రానున్న కాలంలో ప్రతి ఆలయ భూమి వద్ద సర్వే చేయాలని, స్థానిక సమస్యలను జిల్లా కలెక్టరు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్