ఆలిండియా లాయర్స్ యూనియన్ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యంపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరపాలని ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలు) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణను మేలో మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారని, అప్పటి నుంచి తన కుమారుడు కనిపించడం లేదని అతని తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని తెలిపారు. ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు ఇస్తున్న వివరణ, సిఐని సస్పెండ్ చేసి శాఖపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించడం చూస్తే సాయికృష్ణ అదృశ్యంపై అనేక అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులందరినీ సిఐతో సహా విధులకు దూరంగా ఉంచి సమగ్ర విచారణ జరపాలని కోరారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులో బాధ్యులైన పోలీసులు పేర్లు వెల్లడించి వారికి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో ఉన్న కేసు డిస్పోస్ అయిన తర్వాత బాధ్యులపై తగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారికి శిక్షలు పడేవిధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.









కామెంట్‌లు (0)