డేటా సెంటర్ కేటాయింపులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇఎఎస్.శర్మ లేఖ
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : కేవలం ఐదు నెలల క్రితం ఏర్పాటైన ఓ ప్రైవేటు సంస్థకు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రాయితీలు కల్పించడం తీవ్ర అభ్యంతరకరమని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్.శర్మ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పునఃపరిశీలన చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు ఆయన లేఖ రాశారు.
ఆ వివరాలను మీడియాకు మంగళవారం వెల్లడించారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పటికీ స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, పర్యావరణ నిబంధనలు, చట్టపరమైన అంశాలను విస్మరిస్తూ భారీ సామర్థ్యం కలిగిన ఎఐ డేటా సెంటర్లకు అనుమతులివ్వడం సరికాదని శర్మ తన లేఖలో పేర్కొన్నారు.
2026 మార్చి 11న రిజిస్టర్ అయిన ఎఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఐటి శాఖ జారీ చేసిన జిఒ ఎంఎస్ నెంబర్ 59 (తేదీ 22-08-2026) ద్వారా 512 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. భీమునిపట్నం మండలం అమనాం గ్రామంలో ఎకరాకు సుమారు రూ.6 కోట్ల విలువైన భూమికి 25 శాతం రాయితీ కల్పించారని, దీని ద్వారా భూమి విలువపైనే రూ.600 కోట్లకు పైగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని శర్మ పేర్కొన్నారు.
భూమి రాయితీతో పాటు సంస్థకు ప్రభుత్వం మరో రూ.5,176 కోట్ల మేర వివిధ రాయితీలు కల్పించినట్లు ఆయన లేఖలో ప్రస్తావించారు. భారీ నీటి అవసరాలు కలిగిన డేటా సెంటర్లకు ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో స్థానిక ప్రజలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అమనాం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 104/1, 101/3, 101/4, 98/2 తదితర ప్రాంతాల్లో సహజసిద్ధంగా ప్రవహిస్తున్న వాగు దిశను సంస్థ అభ్యర్థన మేరకు మార్చేందుకు ప్రభుత్వం అంగీకరించడం కూడా ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. సహజ వాగులు, జలాశయాల ప్రవాహ మార్గాలు, సరిహద్దులను మార్చడంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సర్వే నెంబర్లు 105, 107 మీదుగా ఉన్న ప్రజా రహదారుల దిశను మార్చే ప్రతిపాదనపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అమనాం ప్రాంతంలోని డేటా సెంటర్ ప్రతిపాదనపై ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలన చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సంబంధిత నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఈ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)