- సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. నేషనల్ ఫిలిమ్స్ లో 9 అవార్డులతో టాలీవుడ్ సత్తా చూపించడం గర్వంగా ఉందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా మరోసారి తన జైత్రయాత్రను చాటిచెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై యువ ప్రతిభతో తెరకెక్కిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు. పల్లెటూరి నేపథ్యంలో స్నేహం,కుటుంబ బంధాలు, సామాజిక విలువలు, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించి జాతీయ అవార్డును అందుకోవడం ఈ చిత్ర బృందం సాధించిన ఘన విజయమని పేర్కొన్నారు. తెలుగు సినిమా కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా.. కథ, కథనం, నటన, సాంకేతిక నైపుణ్యం, కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్, అద్భుతమైన నిర్మాణ విలువలు..ఇలా 24 క్రాఫ్టుల్లోనూ తన తిరుగులేని ప్రతిభను చాటుకుందని తెలిపారు. వెండితెరపై తెలుగు వారి సృజనాత్మకతకు, కష్టానికి దక్కిన గౌరవం ఈ జాతీయ పురస్కారాలని ఆయన పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)