- ఎపి స్టేట్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్
- అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ అధ్యక్షులు చలసాని రాఘవేంద్రరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సహకార అర్భన్ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా స్వరూప స్వభావాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చలసాని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. విజయవాడలోని ఎంబివికెలో ఫెడరేషన్ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార అర్భన్ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, నూతన చట్టాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఫెడరేషన్ అధ్యక్షులు రాఘవేంద్రరావు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడిస్తూ.. రాజ్యాంగంలోని నిభందనలు ఉల్లంఘిస్తూ, కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంతో అర్బన్ బ్యాంకులను నియంత్రించే చేసిన సవరణకు ఆయన ఖండించారు. సహకార రంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశం అయినందున, సహకార బ్యాంక్‌ల బైలాను, ఆయా సహకార చట్టాల మేరకే రూపొందించాల్సి ఉండగా, అన్ని అర్భన్ బ్యాంక్‌లకు ఒకే బైలా రూపకల్పనకు కమిటీని నియమించడం తప్పుబట్టారు. సహకార బ్యాంకులపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ జోక్యం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పట్టణ సహకార బ్యాంకుల డైరెక్టర్లకు విధిస్తున్న అర్హతలు, పదవీకాల పరిమితులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 24 ఏళ్లుగా కొత్త పట్టణ సహకార బ్యాంకులకు ఆర్‌బిఐ లైసెన్సులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అమిత్ షా ప్రకటించిన ‘ప్రతి పట్టణంలో ఒక సహకార బ్యాంకు’ లక్ష్యానికి ఆర్‌బీఐ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. సహకార చట్టాలకు భిన్నంగా బ్యాంకింగ్ నిబంధనలను రుద్దేందుకు ఏర్పాటు చేసిన మోడల్ బైలా రూపకల్పన కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) వద్ద రూ.2.50 లక్షల కోట్ల నిధులు ఉన్నప్పటికీ, డిపాజిట్లకు కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే రక్షణ కల్పించడం అన్యాయమని, మొత్తం డిపాజిట్లకు రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రంలోని 44 పట్టణ సహకార బ్యాంకుల్లో 8 బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ కమిటీలతో కొనసాగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. ఆయా బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వాణిజ్య బ్యాంకులు సామాన్యులకు దూరమవుతున్న నేపథ్యంలో తక్కువ మొత్తంతోనే ఖాతా తెరిచే అవకాశం కల్పిస్తున్న సహకార బ్యాంకులను ప్రజలు ఆశ్రయిస్తున్నారని తెలిపారు. సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు చట్టపరమైన పోరాటంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని మహాజన సభలో తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో ఫెడరేషన్ కార్యదర్శి షేక్ అబ్దుల్ జిలాని, ఉపాధ్యక్షుడు కె.అచ్యుతరామారావు, డైరెక్టర్ లావణ్యదేవి పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)