- కానిస్టేబుల్ మృతి
- ఎస్ఐ, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం మండల పరిధి కొండ కరకాం గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందారు. ఒక ఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... ఒక కేసు విషయంలో దర్యాప్తు చేపట్టేందుకు విజయనగరం రూరల్ పోలీసులు మెడికల్ కాలేజీ మీదుగా కొండ కరకాం గ్రామానికి జీపులో వెళ్తున్నారు. కొండ కరకాం ఘాట్ వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో వారి వాహనం అదుపు తప్పి చిన్న లోయలో పడిపోయింది. దీంతో, కానిస్టేబుల్ శీర వెంకటరమణ (49), ఎస్ఐ అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జి.నాగేంద్ర ప్రసాద్, వాహన డ్రైవర్ ఎఆర్ కానిస్టేబుల్ కె.రాజబాబు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎస్‌పి ఎఆర్.దామోదర్, డిఎస్‌పి రాఘవులు పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. వెంకటరమణ కుటుంబీకులను మంత్రి, ఎస్‌పి ఓదార్చారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత ఎస్‌పితో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. కానిస్టేబుల్ మృతి అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన వెంకటరమణ స్వగ్రామం గుర్ల మండలం భూపాలపురం. ఆయనకు భార్య కృష్ణవేణి, కుమారులు రాహుల్, వెంకట్ ఉన్నారు. వీరిద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. తొలుత ఎపిఎస్‌పిలో 2002లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన వెంకటరమణ, ఆ తర్వాత సివిల్ కానిస్టేబుల్ గా ఎస్.కోట, బొబ్బిలిలో పనిచేశారు. ఆయన మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది.








కామెంట్‌లు (0)