ఖండించిన నేతలు
ప్రజాశక్తి - యంత్రాంగం : భారత ఎన్నికల ప్రధాన అధికారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చేపట్టిన చలో లోక్‌భవన్ కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. సిపిఎం నాయకులను శుక్రవారం ఎక్కడికక్కడ గృహ నిర్బంధనం చేశారు. శుక్రవారం ఉదయాన్నే 5 గంటల నుంచే నిర్బంధానికి దిగారు. సిపిఎం పార్వతీపురం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడుతో సహా పలువుర్ని హౌస్ అరెస్ట్ చేశారు. మక్కువ మండలం తూరుమామిడిలో కొల్లి గంగు నాయుడును, పార్వతీపురంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసును, పాచిపెంటలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావును హౌస్ అరెస్టు చేసి నిర్బంధించారు. జిల్లా వ్యాప్తంగా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులను శుక్రవారం వేకువజాము నుంచే పోలీసులు ఇళ్ల వద్ద మోహరించి అక్రమంగా గృహనిర్బంధం చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. టిడిపి కూటమి ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.వై.నాయుడు, జిల్లా కమిటీ సభ్యులు టి.రాముడు, టి.రవి, టి.పోలిరాజులు విలేకరులతో మాట్లాడారు. అల్లూరి జిల్లా పాడేరులో విద్యార్థి సంఘ నేతలను పోలీసులు నిర్బంధించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవన్, కార్తీక్ శ్రీనులను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేశారు. పోలీసుల చర్యను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఖండించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కార్యదర్శి పి.మహేష్‌ను గృహ నిర్బంధం చేశారు.








కామెంట్‌లు (0)