ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎబేబి సహా అఖిల భారత నాయకులు బి.వి.రాఘవులు, బృందాకరత్, సుభాషిణి ఆలీ, ఆర్.అరుణ్‌కుమార్, సిపిఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి దినేష్ వర్షినే ఇతర వామపక్ష పార్టీల నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన వారిని
బే షరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 13 కోట్ల మంది ఓటర్లను అక్రమంగా తొలగించిన నేరానికి దేశవ్యాప్తంగా ప్రజా నిరసన పెల్లుబుకుతోందని, ప్రధాన ప్రతిపక్షాలన్నీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయని ఈ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఎన్‌డిఏ భాగస్వామ్యం పక్షాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా అనేక ప్రశ్నలు లేవనెత్తాయని, వీటికి సమాధానాలు చెప్పడంలేదని విమర్శించారు. ప్రశాంతంగా ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్తున్న సిపిఎం సీనియర్ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులపై రౌడీలు, సంఘ విద్రోహ శక్తులపై వ్యవహరించినట్లు పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దారుణమని తెలిపారు. ఈ అరెస్టులను ఖండించాలని మేధావులు, ప్రజాతంత్రవాదులు, పౌర సమాజాన్ని కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడానికి జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)