బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుపతిలో బోల్తాపడిన క్రేన్.. ముగ్గురు మృతి

9 గంటల క్రితం

Tirupati-Crane-Accident.jpg.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తిరుపతి సిటీ : తిరుపతిలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ నిర్మాణ పనులు చేస్తున్న భారీ క్రేను బోల్తా పడటంతో ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం... శ్రీనివాసం పక్కనున్న డిబిఆర్ రోడ్డులో ఓ ప్రైవేటు హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. యథా ప్రకారం మంగళవారం భారీ క్రేనుతో 15 అడుగుల లోతులో పిల్లర్ల నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ క్రేన్ ఓ పక్కకు కుంగిపోయి బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఒడిశాకు చెందిన వలస కార్మికుడు రామారావు (45), శ్రీకాళహస్తికి చెందిన సైట్ ఇంజనీర్ సందీప్ (35), తిరుపతికి చెందిన వాచ్‌‌మెన్ గంగయ్య (40) ఆ క్రేన్ కింద ఇరుక్కుని మృతి చెందారు. వారితో పాటే పని చేస్తున్న ఏర్పేడు మండలం ఆర్.మల్లవరానికి చెందిన మురగయ్య, బీహార్‌కు చెందిన షేక్ పరిహాన్ నౌషాన్ (34)‌కు తీవ్ర గాయాలయ్యాయి. అలిపిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. భోజన సమయం కావడంతో అప్పటివరకూ అక్కడే పని చేస్తున్న కార్మికులు భోజనానికి వెళ్లారు. దీంతో, వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘటనా స్థలం వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి : సిఐటియు

క్రేన్‌ ‌ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని సిఐటియు నేతలు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు సిఐటియు నాయకులు కె.వేణుగోపాల్, పి.బుజ్జి, ఎన్‌‌డి శ్రీనివాసులు, బి.శ్రీరాములు, టి.దాసు, నారాయణస్వామి ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్