మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజధానిలో ఏడు చోట్ల ఎనర్జీ స్టేషన్లు టెండర్లను ఆహ్వానించిన సిఆర్‌‌డిఏ

24 ఆగస్టు, 2026

crda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 09:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఏడుచోట్ల 18.25 ఎకరాలు కేటాయింపు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రాజధానిలో విద్యుత్‌ ‌వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏడుచోట్ల విద్యుత్‌ ‌వాహన ఛార్జింగు స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. దీనికోసం టెండర్లను ఆహ్వానించింది. స్టేషన్ల ఏర్పాటుకు 18.25 ఎకరాలను కేటాయించింది. అనంతవరంలో ఒకటి, కురగల్లులో మూడు, నేలపాడులో రెండు, వెలగపూడిలో ఒకటి ఏర్పాటు చేయనున్నారు. అమరావతి రోడ్డు నెట్‌వర్క్‌లోని పౌర సౌకర్యాల ఏర్పాటులో భాగంగా సమీకృత, బహుళ-ఉపయోగ ‘ఎనర్జీ స్టేషన్ల’ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు టెండర్లో పేర్కొంది. వినియోగదారుడిని దృష్టిలో పెట్టుకుని మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా ఈస్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిష్యత్‌‌లో పెట్రోల్, డీజిల్, సిఎన్‌‌జి, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్, రిటైల్, ఫుడ్ అండ్‌ బెవరేజ్, వెల్‌నెస్‌ ‌వంటి సదుపాయాలూ కల్పించాలని నిర్ణయించారు. అమరావతిని సందర్శించే వారికి ఇవొక ప్రత్యేక కేంద్రాలుగా ఉండేలానే ఉద్దేశంతో సిఎం చేసిన సూచన మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ కాన్వాయ్‌లు, ప్రైవేట్ వాహనాలు, ప్రజా రవాణా వాణిజ్య రవాణాతో కూడిన వాహనాల రద్దీ పెరుగుతుందని దానికి అనుగుణంగా ఛార్జింగ్‌ ‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సెక్రటేరియట్, లెజిస్లేచర్, జ్యుడీషియరీ అనుబంధ ప్రభుత్వ కార్యాలయాల వాహనాలకు 24 గంటలూ అందుబాటులో ఉండాలని పొందుపరిచారు. జాతీయ విద్యుత్‌ ‌వాహన మొబిలిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసే ఈ కేంద్రాలకు సంబంధించి అమరావతి ప్రయోగాత్మక కేంద్రంగా ఉండాలని నిర్ణయించినట్లు టెండర్లో పేర్కొన్నారు. ముఖ్యమైన ఆర్ట్రియల్ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ల వెంట ప్రతి ఒక్కరూ చేరుకునే విధంగా వీటిని పెట్టాలని ప్రతిపాదించారు. భవిష్యత్‌‌లో వచ్చే హైడ్రోజన్‌ ‌వాహనాలకు ఇంథనం నింపే కేంద్రాలుగా మార్చేలా ఈ కేంద్రాలు మారుతాయని తెలిపారు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో 33 సంవత్సరాల కాలం, అవసరమైతే మరో 33 సంవత్సరాలు కాలపరిమితిని పొడిగించనున్నట్లు టెండర్లలో పేర్కొన్నారు. ఒక కంపెనీకి మూడు స్టేషన్లు మాత్రమే ఇస్తామని తెలిపారు. వార్షిక లీజు అద్దె ఇంధన, ఇంధనేతర ఆదాయంపై నిర్దిష్ట శాతం కమీషన్ చెల్లించే ప్రాతిపదికన భూభాగాలను కేటాయించనున్నట్లు వివరించారు. దేశంలో మొదటిసారిగా రూపొందించబడిన ప్రత్యేకమైన మల్టీ యుటిలిటీ ఎనర్జీ ఫార్మాట్లను తొలిసారిగా వీటిద్వారా అమరావతిలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. వార్షికలీజు ద్వారా సిఆర్‌‌డిఏకు తగినంత ఆదాయం వచ్చేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు టెండర్లో తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్