ప్రజాశక్తి – అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం అండమాన్‌కు 640 కిలోమీటర్లు, చెన్నైకు 760 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది సోమవారం సాయంత్రానికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపానుకు ఇరాన్ సూచించిన 'అక్వాన్' అనే పేరును ఖరారు చేశారు. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశముందని పేర్కొంది.
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. తుపాను కదలికలు, వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.








కామెంట్‌లు (0)