మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయ డెయిరీ నూతన చైర్మన్‌‌గా డాక్టర్‌ దాసరి

1 గంట క్రితం

vijaya milk.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 09:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విజయవాడ సిటీ, గన్నవరం : కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) నూతన చైర్మన్‌గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్‌ నాయకులు డాక్టర్‌ దాసరి వెంకట బాలవర్ధన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు యూనియన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొల్లి ఈశ్వర్‌ బాబు ప్రకటించారు. పాలకవర్గంలో మొత్తంగా 14 మంది డైరెక్టర్లకుగాను కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆముదాలపల్లి పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం అధ్యక్షుడు, కృష్ణామిల్క్‌ ‌యూనియన్‌ డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ ‌దాసరి వెంకట బాలవర్థనరావును చైర్మన్‌‌గా మరో డైరెక్టర్‌ అర్జా వెంకట నగేష్‌ ప్రతిపాదించారు. మరో డైరెక్టర్‌ ‌నెక్కలపు వాణిశ్రీ బలపరిచారు. డైరెక్టర్లంతా చేతులెత్తడం ద్వారా దాసరిని చైర్మన్‌‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దాసరి వెంకట బాలవర్థనరావు మాట్లాడుతూ.. మిల్క్‌ ‌యూనియన్‌ దీర్ఘకాల ప్రయోజనాలను కాపాడుతూ పాడి రైతులకు అండగా నిలుస్తానన్నారు.

పెంచిన ధరలను తగ్గించాలని సిపిఎం నిరసన

పెంచిన విజయ పాల ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన మిల్క్‌ ‌ఫ్యాక్టరీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాల ధరలను తగ్గించాలని గత పది రోజులుగా జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సిపిఎం కార్యకర్తలు, మహిళలు.. బ్యానర్లు, ప్లకార్డులతో విజయవాడ చిట్టినగర్‌‌లోని మిల్క్ ప్రాజెక్టు ప్రధాన గేటు వద్దకు చేరుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ధరలు తగ్గించాలని నూతన చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించేందుకు నేతలు ప్రయత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులపై సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఎట్టకేలకు మిల్క్ యూనియన్ ఎండి, ఇతర అధికారులు వచ్చి సర్దిచెప్పారు. సెక్యూరిటీ అధికారులు క్షమాపణలు చెప్పారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు నగర కార్యదర్శులు బోయి సత్యబాబు, బి.రమణరావు, పి.కృష్ణ తదితరులు... బాలవర్థనరావును కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం వెంటనే బోర్డు సమావేశం ఏర్పాటు చేసి పెంచిన పాల ధరలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

cpm protest.jpg


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్