గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైకోర్టు 'ఉత్తర్వుల' ప్రకారం డేటా సెంటర్ల అనుమతులు రద్దు చేయాలి

1 గంట క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 12:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రూ.22 వేల కోట్ల రాయితీలు ఉపసంహరించుకోవాలి

- సిపిఎం డిమాండ్

ప్రజాశక్తి-విశాఖ: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం తక్షణమే అడవివరం డేటా సెంటర్ అనుమతులు రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు డిమాండ్ చేశారు. డేటా సెంటర్ కు కేటాయించిన భూములు, రూ.22వేల కోట్ల పన్ను రాయితీలు, సబ్సిడీలు, మౌలికసదుపాయాలన్నీ ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. డేటా సెంటర్ పేరుతో జరుగుతున్న నిలువ దోపిడీని ప్రజలు అడ్డుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యాలయం ఏచూరి భవన్లో గురువారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ కె ఎస్ వి కుమార్, వి కృష్ణారావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే పర్యావరణ వేత్తలు, సిపిఎం రాష్ట్ర హైకోర్టులోనూ, గ్రీన్ ట్రిబ్యునల్లోనూ డేటా సెంటర్లతో కలిగే ముప్పు, పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, చట్ట వ్యతిరేక చర్యలపై అప్పీల్స్ వేసినట్లు తెలిపారు. ప్రజల ఆవాసాల మధ్య నిర్మిస్తున్న డేటా సెంటర్లను వ్యతిరేకిస్తూ పర్యావరణ సంస్థలు, మేధావులు, నివాస సంఘాలు, ప్రజలు చేపట్టిన నిరసనలు, పోరాటాలను గౌరవించి డేటా సెంటర్ అనుమతులు రద్దు చేయాలన్నారు.

డేటా సెంటర్ల అనుమతుల మంజూరులో కూటమి ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిందన్నారు. ఏ కేటగిరి నుంచి బి కేటగిరి కింద మార్చి ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించకుండా, పర్యావరణ నిపుణులతో సామాజిక పర్యావరణ ప్రభావ నివేదికను తయారుచేయకుండా నిర్మాణ పనులు ఏకపక్షంగా జరిగేలా వారం రోజుల్లోనే అనుమతులన్నీ మంజూరుచేసిందని తెలిపారు. చట్టవిరుద్ధంగా సింహాచలం దేవస్థానం భూములు 162 ఎకరాలు, జీవిఎంసి భూములు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిందన్నారు. పర్యావరణ పరిధిలోకి వచ్చే కొండలు, ముడసర్లోవ తాగునీటి రిజర్వాయర్, రిజర్వు ఫారెస్టుకు చెందిన అత్యంత సున్నితమైన 860 మీటర్ల దూరంలోని కంబాలకొండకు ముప్పు కలుగుతుందన్నారు. ప్రజలు నివసించే ఆడవివరం, ముడసర్లోవ, ఆరిలోవ ప్రాంతంలో డేటా సెంటర్ ఏర్పాటుతో తాగునీటి సమస్య పెరుగుతుందన్నారు.

ఆనందపురం మండలం తర్లువాడ గ్రామ దళిత రైతుల భూములను దౌర్జన్యంగా గుంజుకొని గూగుల్, అదానీ డేటా సెంటర్ కు కట్టబెట్టారని, బాధితులకు చెల్లిస్తామన్న పరిహారం నేటికీ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. 20 సెంట్లు భూ నష్టపరిహారం, షాపింగ్ కాంప్లెక్స్, ఉద్యోగం, 520 మంది రైతులకు ఇచ్చిన హామీలేవీ అమలుచేయలేదన్నారు. భూ సేకరణ చట్టం నిబంధనలన్నీ తుంగలో తొక్కి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తోందన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ఆపకపోతే విశాఖ ప్రజలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ద్రోహంచేసి అదానీ, అంబాని వంటి కార్పొరేట్ సంస్థలకు విలువైన ప్రజల భూములను ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. ప్రజల వ్యతిరేకత, నిరసనలు పట్టించుకోకుండా కార్పొరేట్ల లాభాల కోసం ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టడం దుర్మార్గమన్నారు. డేటా సెంటర్లను ప్రభుత్వం రద్దు చేయకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ, తాగునీటి వనరుల అభివృద్ధి, డేటా సెంటర్ల రద్దు కోసం విశాఖ ప్రజలు ఉద్యమించాలన్నారు.

కార్పొరేట్ గేట్ వేగా ఉత్తరాంధ్ర

కూటమి ప్రభుత్వం ఎకానమీ గేట్ వే పేరుతో ఉత్తరాంధ్రను పూర్తిగా కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నదని గంగారావు విమర్శించారు. పెట్టుబడుల సమ్మిట్లు, విశాఖ ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల పేరుతో ఉత్తరాంధ్ర ప్రజా వనరులన్నింటినీ కొల్లగొడుతున్నారని అన్నారు. రైతుల భూములను, ప్రభుత్వ భూములను, కొండలను, సముద్రతీరాన్ని, ఖనిజ సంపదను, గిరిజన భూములు, కాఫీ తోటలు ఇలా మొత్తం సహజ వనరులతో సహా కార్పొరేట్ శక్తులకు సొంత ఆస్తులుగా బదిలీచేస్తున్నారని తెలిపారు. త్వరలో రుషికొండ పేలస్, దీని చుట్టూవున్న భూములను విశాఖలోని స్టార్ హెూటల్ యజమానికి అప్పగించాలని చూస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మార్కెట్లో అమ్మకానికి పెట్టిందన్నారు. జివిఎంసిలోని పౌరసేవలు, మౌలిక సదుపాయాలు, ఉమ్మడి ప్రజా వనరులన్నింటినీ పిపిపి పేర 99 ఏళ్లకు రాజకీయ, వ్యాపార సంస్థలకు కట్టబెట్టాలని చూస్తుందన్నారు. ఉత్తరాంధ్రను విధ్వంసం చేసి, ప్రజల జీవనాన్ని దెబ్బతీయడంతో అసమానతలు, వలసలు పెరుగుతాయని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్