- ఒంటరి మహిళలు, యువతులే లక్ష్యంగా సైబర్ మోసాలు
ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో నయా ట్రెండ్ నడుస్తోంది.. ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఈ మధ్యనే వెలుగు చూసింది. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫొటోలతో వల
ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలుగా ‘ఆగస్టులో 50 శాతం డిస్కౌంట్’ పేరుతో ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫొటోలతో పోస్టర్లను చూపి వల వేస్తున్నారు. గంట కాఫీ మీటింగ్‌కు రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి రూ.1,499, ఈవెంట్లు లేదా పెళ్లీలకు తోడుగా వచ్చేందుకు రూ.1,999, అలాగే పది గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూ. 4,499 అంటూ కేటుగాళ్లు ధరలను ప్రదర్శిస్తున్నారు.
గోప్యంగా మెసేజ్‌తో బుకింగ్స్
ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారమూ కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని ఎఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి అమ్మాయిలతో దుండగలు సంభాషణలు మొదలుపెట్టి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూళ్లు అయ్యాక ఆ అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారు. ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక దృష్టిసారించింది.
వెబ్‌సైట్లు, అపరిచితుల పట్ల జాగ్రత్త: సిపి
వెబ్‌సైట్లు, అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ తెలిపారు. ఆన్‌లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలున్నాయన్నారు. చాటింగ్ క్రమంలో సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫొటోల ఆధారంగా బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉందన్నారు. అమ్మాయిలతోపాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.








కామెంట్‌లు (0)