మృతుల్లో రైతు, కౌలురైతు
ప్రజాశక్తి-ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా), పెదకూరపాడు (పల్నాడు జిల్లా): అప్పుల బాధతో ఇద్దరు కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన చిమటా భాస్కర్ (40) ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ, ట్రాక్టర్ డ్రైవర్‌గానూ వెళ్తుండేవారు. ఆయన గతేడాది 1.5 ఎకరాల్లో మిర్చి, 3.5 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. మొత్తం రూ.15 లక్షలు అప్పులయ్యాయి. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తీవ్రమై మనస్తాపంతో సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు లుంగీతో ఉరేసుకున్నారు. మంగళవారం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు వికలాంగులైన తండ్రి, సోదరుడు ఉన్నారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం తమ్మవరం గ్రామానికి చెందిన కత్తుల బాల కోటేశ్వరరావు (45) తనకున్న అరెకరంతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి సాగు చేస్తున్నారు. పెట్టుబడుల కోసం చేసి రూ.11 లక్షల అప్పులను తీర్చలేక మనస్తాపంతో ఈ నెల 27న ఇంట్లో ఉన్న గడ్డి మందును తాగారు. గమనించిన కుటుంబీకులు వెంటనే అమరావతిలోని హాస్పిటల్‌కు అనంతరం గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్), ఆ తర్వాత మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సోమవారం అర్ధ రాత్రి మృతి చెందారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెదకూరపాడు ఎస్‌ఐ అల్లూరిరెడ్డి కేసు నమోదు చేశారు.









కామెంట్‌లు (0)