ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే నిర్ణయాలను మంత్రివర్గ సమావేశం వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటుకు ఉన్న నిబంధనలను తొలగించడం, విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల ప్రోత్సాహక విధానం-2026ను ఆమోదించడాన్ని ఖండిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్నకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా రంగాన్ని మరింత ప్రైవేటుపరం చేసే నిర్ణయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విద్య చట్టం-1982లోని సెక్షన్లను సవరించడం వల్ల ఇప్పటికే మితిమీరిన ప్రైవేటు, కార్పొరేట్ విద్య మరింత బలపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సమస్యలతో, అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వాటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం మరింత ప్రోత్సహించడం అత్యంత శోచనీయమని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విదేశీ, ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులివ్వడం ద్వారా సామాజిక న్యాయం, రిజర్వేషన్ల ప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెంచి, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు పెంచిన 10 శాతం మెస్‌బిల్లు నేటి ధరలకు ఏమాత్రం సరిపోదని, నెలకు రూ.3 వేలు పెంచాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)