సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు, బెదిరింపులతో సాధించిన ఏకగ్రీవ ఎన్నికల ప్రకటనలను వెంటనే రద్దు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏకగ్రీవంగా ప్రకటించిన స్థానాలన్నింటికీ కొత్తగా నామినేషన్లు స్వీకరించి, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన ఎన్నికల వాతావరణాన్ని పునరుద్ధరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యాలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరించడం, దాడులకు పాల్పడటమే కాకుండా నామినేషన్ పత్రాలను బహిరంగంగా చించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం ఎందుకని రామకృష్ణ ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)