ఐక్య విద్యార్థి, యువజన ఉద్యమంతో బుద్ధి చెప్పినా, తీరు మారని బిజెపి వైఖరి
ఢిల్లీలో సి.పి.ఎం ప్రధాన కార్యాలయంపై ఢిల్లీ పోలీసుల దాడి దుర్మార్గం.
విద్యార్థి నాయకురాలు ఐషి ఘోష్ అక్రమ అరెస్టు చేసే ప్రయత్నాలు అక్రమం
శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అక్రమ కేసులు బనాయించి దౌర్జన్యంగా అరెస్టు చేయటం శోచనీయం
ఉద్యమ సందర్భంలో పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వ నిర్బంధ వైఖరిని ఖండిస్తూ విజయవాడలో సిపిఎం ధర్నా, నిరసన
-సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్.
విజయవాడ : విద్యార్థి నాయకుల పై కేసులు నిర్బంధం దౌర్జన్యాలను నిరసిస్తూ .... సిపిఎం కేంద్ర కార్యాలయం పై ఢిల్లీ పోలీసుల దాడిని ఖండిస్తూ నేడు విజయవాడ బీసెంట్ రోడ్ లోని మహంతి మార్కెట్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. కార్యకర్తల పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల దుర్మార్గాలను ఖండించారు. విజయవాడ బీసెంట్ రోడ్డులో జరిగిన నిరసన ధర్నాలో సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సిహెచ్. బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడారు. ఢిల్లీలోని సి.పి.ఎం కేంద్ర కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు దౌర్జన్యంగా చొరబడి, విద్యార్థి నాయకురాలు ఐషి ఘోష్‌ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గం అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కలసి ఆందోళన చేసిన విద్యార్థులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆందోళన చేసిన విద్యార్థులు, అండగా నిలిచిన నేతలపై కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయటం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం చేసే అక్రమాలను, దారుణాలను ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు విద్యార్థులపై తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయడం దారుణమని విమర్శించారు. ఆందోళన చేసిన విద్యార్థులపై కేసులు పెట్టమని, అరెస్టులు చేయబోమని ప్రభుత్వం ఇచ్చిన మాట ఒక్క రోజులోనే తప్పిందన్నారు. యువత మొత్తం తప్పు పట్టి దోషిగా నిలబెట్టిన ధర్మేంద్ర ప్రధాన్ కు బిజెపి నేతలు పార్లమెంట్లో స్వాగతం పలకటం సిగ్గుచేటన్నారు. మోడీ, అమిత్ షా ఆదేశాలతో.. ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. బీహార్ లో ఏకే 47 గన్స్ తో కాల్పులు జరిపారు. విద్యార్థులను ఉగ్రవాదుల చూడటం తగదన్నారు. విద్యార్థి ఉద్యమాన్ని నేతలను ఆందోళనకారులను దూషిస్తూ బిజెపి ఆర్ఎస్ఎస్ నేతలు ఇంకా వ్యాఖ్యలు చేస్తూనే ఉండటం వారి పాశవిక, దుర్మార్గ వైఖరిని రుజువు చేస్తుందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పోరాట విజయం. విద్యారంగ లోపాలు, నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరు కొనసాగాలి. విద్యార్థి ఉద్యమానికి మద్దతు తెలుపకుండా దాడి చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లోని నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ జన్ జీ ప్రతినిధులుగా చెప్పుకుంటూ మౌనం వహించటం సిగ్గుచేటు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ విద్యార్థి ఉద్యమాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. జగన్ గోడమీద పిల్లిలా వ్యవహరించడం సరికాదు. శాంతియుతంగా నిరసన తెలుపుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ, పోలీసులు.. విద్యార్థులపై దాడులు చేస్తూ అణచివేతకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులన్నీ భేషరతుగా రద్దు చేసేవరకు సిపిఎం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు, తూర్పు నగర కార్యదర్శి పి. కృష్ణతో పాటు నాయకులు ఎం. సీతారాములు, కె. దుర్గారావు, ఎన్. నాగేశ్వరరావు, వై. సుబ్బారావు, ఎం. సోమేశ్వరరావు, టి. ప్రవీణ్, కె. సూరిబాబు, చిన్నారావు, టి. చంద్రశేఖర్, ఎస్.కే. ఫీరు సాహెబ్, చింతల శ్రీనివాసు, డి. వరప్రసాద్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)