మాజీ సిఎం జగన్
సాగులో ఉన్న పొలాలను ధ్వంసం చేయడం దుర్మార్గం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం రాక్షసకాండను సాగిస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ సిఎం జగన్ తెలిపారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని తెలిపారు. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమని తెలిపారు. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులేనని, వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారమని పేర్కొన్నారు. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారని, పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారని వివరించారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టని విమర్ఙించారు. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారని, మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోందో చెప్పాలన్నారు. రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా? చెప్పాలన్నారు. ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవని, విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములని తెలిపారు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాలన్నారు. రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుందని తెలిపారు. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలని, ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలని, రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదని సూచించారు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని అన్నారు.








కామెంట్‌లు (0)