తూర్పు నౌకాదళ కమాండ్ కార్యాచరణపై సమీక్ష
ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : భారత నౌకాదళ డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు విశాఖపట్నంలో పర్యటించి తూర్పు నౌకాదళ కమాండ్ కార్యాచరణ సిద్ధత, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ కమాండ్ నిర్వహిస్తున్న కార్యాచరణ బాధ్యతలు, దళాల సామర్థ్యం, ఆధునీకరణ కార్యక్రమాలపై సమగ్ర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాతో సమావేశమై సముద్ర భద్రత, కార్యాచరణ సిద్ధత, భవిష్యత్తు సామర్థ్యాభివృద్ధిపై చర్చించారు. వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి ఐఎన్‌ఎస్ అగ్రయ్, ఐఎన్‌ఎస్ దునగిరి, ఐఎన్‌ఎస్ మైసూర్ యుద్ధ నౌకలను సందర్శించి వాటి యుద్ధ సిద్ధతను పరిశీలించారు. కమాండింగ్ అధికారులు, నౌకాదళ సిబ్బందితో సమావేశమై వారి వృత్తి నైపుణ్యం, అంకితభావాన్ని అభినందించారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో కొనసాగుతున్న నౌకల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు తూర్పు నౌకాదళ కమాండ్‌లో చేపడుతున్న కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించారు. భారత నౌకాదళ విజన్–2047, సముద్ర సిద్ధాంతం, సముద్ర భద్రతా వ్యూహంపై అధికారులనుద్దేశించి ప్రసంగించారు.








కామెంట్‌లు (0)