శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దోపిడీ శక్తులకే ‘వికసిత్ భారత్’

1 గంట క్రితం

ram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- దిగజారుతున్న పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : కేంద్రంలోని మోడీ చెబుతున్న వికసిత్ భారత్ నినాదం కేవలం దోపిడీ శక్తులకు వర్తిస్తుందని ప్రజాశక్తి డిప్యూటీ ఎడిటర్ వి.రాంభూపాల్ అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న మోసపూరిత విధానాల వల్ల పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు జిడిపి గ్రోత్ లెక్కలు తప్పుగా చూపిస్తున్నారని విమర్శించారు. ‘వికసిత భారతదేశం - భ్రమలు - వాస్తవాలు’ అనే అంశంపై గురజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో తోట పాలెంలోని సత్య డిగ్రీ కాలేజీలో శుక్రవారం సదస్సు జరిగింది. ముఖ్యవక్తగా హాజరైన రాంభూపాల్ మాట్లాడుతూ దేశంలో 48 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం సంక్షోభంలోకి నెట్టి, ఆ స్థానంలో అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు కార్పొరేటర్ వ్యవసాయానికి తెరలేపిందన్నారు. అందులో భాగంగానే భూమి నుంచి రైతులను దూరం చేసేందుకు వారికి ఇచ్చే సబ్సిడీలు తగ్గించడంతో పాటు మద్దతు ధర, గిట్టుబాటు ధర పెంచడం లేదని అన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీ ఈ ఏడాది రూ.24,894 కోట్ల మేర తగ్గిందని గుర్తు చేశారు. దీనివల్ల రైతులపై ఆర్థిక భారం పడడంతో పాటు ఎరువుల వినియోగం తగ్గడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరక్క దుర్భరమైన జీవనం సాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఖాళీ అవుతున్న భూములను కార్పొరేట్ వ్యవసాయానికి మళ్లించే పనిలో మోడీ ప్రభుత్వం ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటూ 2025 నాటికి తయారీ రంగంలో 25 శాతం వృద్ధిరేటు సాధిస్తామంటూ మోడీ పదేపదే చెప్పినప్పటికీ, 11 శాతానికి మించలేదని తెలిపారు. అమెరికాలో సగటు రైతుకు రూ.26 లక్షల సబ్సిడీ ఇస్తుంటే, మనదేశంలో కేవలం రూ.21 వేలు దఫ దఫాలుగా చెల్లిస్తోందని వివరించారు. ఉపాధి కార్మికులకు రూ.300కు మించి వేతనం ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో కేవలం 300 కుటుంబాలకు 14 లక్షల 14 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల రుణమాఫీ చేసిందని అన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు వి.రాజగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్