- ఉపాధ్యాయ టెట్‌పై స్పందించని మంత్రి
- యుటిఎఫ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పేరుతో విద్యార్ధులను, టెట్ పరీక్షల పేరుతో ఉపాధ్యాయులను మానసిక ఇబ్బందికి గురిచేసిందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది. ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ విజయవాడలోని రాష్ట్రకార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్‌టిఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష లీజేక్ వల్ల 20మందికి పైగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న మంత్రి ధర్మేంద్ర స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధులపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఎన్‌టిఎను రద్దు చేసి నీట్ పరీక్షను రాష్ర్టాలు నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. నీట్ పరీక్ష రద్దు, విద్యారంగ ప్రక్షాళన, ధర్మేంద్ర రాజీనామా చేయాలని కోరుతూ పర్యావరణ, సామాజిక విద్యావేత్త సోనమ్‌వాంగ్ చుక్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తునట్లు తెలిపారు. 2010 కంటే ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల దేశంలో 20లక్షలకు మందికిపైగా ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నా మంత్రి స్పందించడం లేదని విమర్శించారు. ఉపాధ్యాయుల ఆందోళనకు కారణమైన విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1) సవరణ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా మంత్రి వ్యవహరిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలపై స్పందించిన వెంటనే ధర్మేంద్రతో రాజీనామా చేయించాలని, ఎన్‌టిఎను రద్దు చేసి నీట్ నిర్వహణ రాష్ర్టాలకు అప్పగించాలని, టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ప్రచురణల విభాగం చైర్మన్ ఎం హనుమంతరావు, మోడల్ స్కూల్ యూనియన్ నాయకులు పి చంద్రశేఖర్ ఆజాద్, ఎస్ బాలాజీ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)