వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కరువు సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్‌ఓ కార్యాలయాల వద్ద 21వ తేది నుంచి మూడు రోజుల పాటు ధర్నాలు నిర్వహించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. బుధ, గురువారాల్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వడ్డేశ్వరంలోని సంఘ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు డి.రమాదేవి అధ్యక్షతనఈ సమావేశం జరిగింది. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో కరువు ప్రాంతాలను తక్షణమే ప్రకటించాలని, కరువు ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పనులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితులపై స్పందించకపోవడం గమర్హనీయమని పేర్కొంది. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఉపాధిహామి పనులు కల్పించి వలసలు నివారించాలని, వేతన బకాయిలు చెల్లించడంతోపాటు, రెండు చోట్ల ఫోటో విధానం నిలిపివేయాలని కోరింది. న్యాయమైన కూలే చెల్లించాలని, ప్రజా పంపిణీ ద్వారా తక్కువధరకు ఆహారధాన్యాలు అందిచాలని డిమాండ్ చేసింది. ప్రతి కుటుంబానికి కావలసిన ఉపాధి పనులు కల్పించి రోజుకు రూ. 600 వచ్చేలా చర్యలు తీసుకోవడం, చేసిన పనికి ప్రతివారం వేతనాలు చెల్లించడం, నేలగా గట్టిగా ఉన్న చోట్ల 30 శాతం అలవెన్స్ ఇవ్వాలని కోరింది. ప్రజాపంపిణీ ద్వారా ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించడం, డ్వాక్రా గ్రూపుల పాత రుణాలు మాఫిచేయాలని, రూ.10 లక్షల వరకు ఉన్న రుణాలపై వడ్డీ హామీ అమలు చేయాలని కోరింది. సెలవుల్లో కూడా ప్రభుత్వ స్కూళ్ళలలో మద్యాహ్న భోజనం పెట్టాలని, ముందస్తు కౌలు చెల్లించి నష్టపోయిన కౌలు రైతులకు కౌలు వెనక్కి ఇవ్వాలని, నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. వ్యవసాయ కార్మికులు, కౌలు రైతు, చిన్న, సన్నకారు రైతులకు, వృత్తిదారులకు నెలకు రూ.10 వేల చొప్పున ఆరు నెలల పాటు కరువు భత్యం చెల్లించాలని, పశువులకు, జీవాలకు ఉచితంగా మేత, దాణా సరఫరా చేయాలని తాగునీటి కోసం చెరువులు నింపడంతో పాటు అన్నిచోట్ల ఫిల్టర్ బెడ్లను బాగుచేసి తాగునీరు అందించాలని కోరింది. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.లోకనాధం రానున్న 2 నెలల పాటు సామాజిక న్యాయం, భూమి, ఉపాధి హామీ, పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా చేపట్టబోయే ఆందోళన పోరాటాలను వివరించారు. కరువుపై తీర్మానాన్ని రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సంఘం రాష్ట్ర నాయకులు కె. ఆంజనేయులు, డి. సుబ్బారావు, వి. శివ నాగరాణి పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)