రెండో త్రైమాసికం నుంచి వర్తింపు
హాస్టళ్ల స్థానంలో *గురుకులాల నిర్మాణం
సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ, ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని స్పష్టం చేశారు. బలహీనవర్గాల విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బిసి,ఎస్‌సి,ఎస్‌టి, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని చెప్పారు. మెరుగైన విద్య, మౌళిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే డైట్ ఛార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సిఎం చెప్పారు. దీనికోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలన్నారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలన్నారు. గురుకులాల్లో నెట్‌జీరో విధానాన్ని అమలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విశ్లేషించాలని చెప్పారను. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని, హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు తర్పీదు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇవ్వాలన్నారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదువు కుంటూ ప్రతిభ కనబరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఐటిఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి, నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు వర్క్‌ఫోర్స్ సిద్దం చేయాలన్నారు. హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఓ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని, సంక్షేమ హాస్టళ్లను ఎన్ఆర్ఐలు దత్తత చేసుకునేలా వారితో సంప్రదింపులు జరపాలని సూచించారు.
పేదలకు పథకాల లబ్ది
పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమం అందించడమే కాదు, వారి జీవనోపాధిని మెరుగు పరిచి, మరింత ఆదాయాలు సమకూర్చేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం వైపు నుంచి అందించే సంక్షేమం, మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పించడంతోపాటు, పీ4 ద్వారా సాయం కూడా అందాలన్నారు. లిక్కర్ షాపుల్లో కల్లుగీత వృత్తిదారులకు, క్వారీల్లో వడ్డెర్లకు అవకాశం కల్పించామని, నాయీ బ్రహ్మాణులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఇలా వివిధ వర్గాలకు ఆర్థికంగా సాయం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పరంగా అందించే సాయమే కాకుండా... వారి అభివృద్ధికి ఏమేం చర్యలు తీసుకోవానే అంశంపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వివిధ కుల కార్పొరేషన్ల బై లాస్ మార్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ విధానాలను మిగిలిన కార్పొరేషన్లు కూడా అవలంభించేలా చర్యలు తీసుకోవాల్నారు. సమీక్షలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, సవిత, సంధ్యారాణి, ఎన్ఎండి ఫరూక్, మైనార్టీ సంక్షేమ సలహాదారు మహ్మద్ షరీఫ్ సహా వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.








కామెంట్‌లు (0)