ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
ప్రజాశక్తి - బనగానపల్లె : పంటలు పండే సారవంతమైన భూములను సోలార్ ప్రాజెక్టులకు కేటాయించవద్దని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామంలో సోలార్ కంపెనీలు సేకరించాలని భావిస్తున్న భూములను రైతు సంఘం నాయకులు, రైతులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామచంద్రుడు అధ్యక్షతన జరిగిన రైతు సమావేశంలో కె. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. పాతపాడు, మీరాపురం గ్రామాల్లో బోరు బావుల కింద ఏడాదికి రెండు, మూడు పంటలు పండే సారవంతమైన మాగాణి భూములను సోలార్ కంపెనీలకు ఇవ్వడం దారుణమన్నారు. బంజరు భూముల్లో మాత్రమే సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల అంగీకారం లేకుండా, గ్రామసభలు నిర్వహించకుండా బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల సమ్మతికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పటికే చేసుకున్న సోలార్ కంపెనీల ఒప్పందాలను సమీక్షించి, రైతులకు నష్టం కలిగించే నిబంధనలను రద్దు చేయాలన్నారు. భూములను సుదీర్ఘకాలం లీజుకు ఇవ్వడం వల్ల రైతులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఐదేళ్లకు మించి లీజు ఒప్పందాలు ఉండకూడదని, భూమి అసలు పత్రాలు రైతుల వద్దే ఉండేలా చూడాలని, ఎకరాకు ఏడాదికి రూ. 50 వేల లీజు చెల్లిస్తూ, ప్రతి ఏటా పది శాతం చొప్పున పెంచాలని డిమాండ్ చేశారు. సోలార్ కంపెనీల లాభాల్లో భూములు ఇచ్చిన రైతులకు ఏటా పది శాతం వాటా, గ్రామాభివృద్ధికి పది శాతం నిధులు కేటాయించేలా ప్రభుత్వం నిబంధనలు విధించాలని, ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఉచిత విద్యుత్, సోలార్ ప్రాజెక్టుల వల్ల ఉపాధి కోల్పోయే వ్యవసాయ కార్మికులకు తగిన పునరావాసం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎ. రాజశేఖర్, ఉపాధ్యక్షులు వి.సుబ్బారాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, స్థానిక రైతులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)