విశాఖ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీల ధర్నా
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖలోని మారికవలస గిరిజన గురుకులం బాలుర పాఠశాలను రద్దు చేసి, అదే స్కూల్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆదివాసీ గిరిజన సంఘం, ఎపి గిరిజన గురుకులం (బాలురు) మారికవలస పాఠశాల పేరేంట్స్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలో గురువారం విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ గోచీలు కట్టుకుని, అడ్డాకుల టోపీలు పెట్టుకుని వినూత్నంగా భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీని పోలీసులు తొలుత అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద గిరిజన సమాఖ్య అల్లూరి జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ అధ్యక్షతన ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పలనర్స మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, ఉన్న పాఠశాలను రద్దు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 2004లో ఆదివాసీ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య కోసం ఈ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని, నేడు సుమారు 500 మంది గిరిజన విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. పాఠశాలలో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించిందని, అందులో ఉత్తీర్ణులైన మెరిట్ గిరిజన విద్యార్థులకు మాత్రమే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని మంజూరు చేసిందని చెప్పారు. అదే సమయంలో ఈ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న 5, 6, 7 తరగతులకు చెందిన 274 మంది ఉత్తరాంధ్ర ప్రాంత గిరిజన విద్యార్థులను మొదటి దశలో ఏజెన్సీ ప్రాంత పాఠశాలలకు బలవంతంగా బదిలీ చేస్తున్నారన్నారు. పాఠశాల భవనంపై అదనపు భవనం నిర్మాణానికి అవకాశం ఉన్నప్పటికీ ఏజెన్సీ పాఠశాలలకు విద్యార్థులను తరలిస్తున్నారని తెలిపారు. మారికవలస గిరిజన గురుకులం పాఠశాలను కొనసాగించాలని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి ప్రత్యామ్నాయ భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి బాలదేవ్, ధర్మాన పడాల్, పాఠశాల రక్షణ కమిటీ కన్వీనర్ వంజంగి రమేష్ నాయుడు, మహిళా కన్వీనర్ సీదరి శ్రీలత, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ కొర్రా రాజేష్, భాను, భారతి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)