- డిజిపి ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు కచ్చితంగా పాటించాలి
- తేల్చి చెప్పిన హైకోర్టు
ప్రజాశక్తి-అమరావతి: భూమి, ఆస్తి తగాదాలు సహా సివిల్ వివాదాల్లో, ముఖ్యంగా సివిల్ కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పౌరుల సివిల్ హక్కులను నిర్ణయించే అధికారం పోలీసులకు లేదని, ఆ పరిధి సివిల్ కోర్టులు, చట్టబద్ధమైన న్యాయ వేదికలకు మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ విషయంలో గతేడాది అక్టోబరు 24న డిజిపి జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కుంచం మహేశ్వరరావు తీర్పు చెప్పారు. సివిల్ కోర్టుల్లో దావాలు పెండింగ్లో ఉన్నప్పటికీ వివిధ జిల్లాల పోలీసులు వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని పేర్కొంటూ దాఖలైన ఏడు పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు. నేరం జరిగినప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం, అనంతరం సంబంధిత కోర్టులో చార్జిషీట్ లేదా తుది నివేదిక దాఖలు చేయడమే పోలీసుల బాధ్యతని పేర్కొన్నారు. ఆ తర్వాత విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సింది న్యాయస్థానాలేనన్నారు. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం అనేక సమస్యలకు దారితీస్తుందని, మండల, డివిజన్, జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లకు శాంతిభద్రతల పరిరక్షణకు ఆదేశాలు జారీ చేసే అధికారాలున్నప్పటికీ, వివాదం సివిల్ కోర్టు పరిధిలోకి వెళ్లిన తర్వాత ఆ అధికారాలను వినియోగించడానికి వీల్లేదని తెలిపారు. పరిమిత సంఖ్యలో ఉన్న పోలీసు బలగాలు తమ పరిధిలో లేని సివిల్ వివాదాలపై దృష్టి సారించడం వల్ల కొందరు పోలీసు అధికారులకు అక్రమ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందన్నారు. వలస పాలన నాటి పోలీసు వ్యవస్థ నుంచి ప్రజల అవసరాలకు అనుగుణమైన వ్యవస్థగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.








కామెంట్లు (0)