గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాజధాని నిర్మాణానికి అప్పులు చేయొద్దు..

2 రోజుల క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కేంద్రం నుంచి నిధులు సాధించాలి

  • జిఓ 1397 రద్దు

  • తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు

  • సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి నిర్మాణ అంచనాలను పెంచి ఆ పేరుతో ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికోసం విడుదల చేసిన జిఓ 1397ను ఉపహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణ అంచనాలను రూ.1,33,302 కోట్లకు పెంచుతూ, 2046 వరకు ఆదాయం సమకూర్చుకునే సాకుతో అప్పుల ఊబిలోకి దించడానికి అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 16 /11 /2026న 1397 జిఓ విడుదల చేసిందని తెలిపారు. 2046 వరకు ఆదాయం సమకూర్చడానికి అప్పులు చేయడం, ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, సొంత ఆదాయం పేరు చెప్పి ప్రజలపై భారాల మోపడానికి ఆస్కారం కలిగించే రీతిలో జిఓలో పేర్కొన్న అంశాలు ప్రమాదకరమైనవని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు సాధించి, ప్రజా రాజధాని నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, దానికి భిన్నంగా ప్రపంచ బ్యాంకు, ఎడిబి తదితర సంస్థల నుంచి అప్పులు తెస్తూ, వారి ఆదేశాలకు లొంగిపోయి రాజధానికి, రాష్ట్రానికి హాని కలిగించే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం శోచనీయమని తెలిపారు. పిపిపి ముసుగులో రాజధానిలో విలువైన భూములను, ఆస్తులను బడా కంపెనీలకు కట్టబెడుతూ ప్రభుత్వ ఖజానా నుండి రాయితీల పేరుతో నిధులు సమకూర్చుతోందని విమర్శించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన కూలీలు, ఇతర ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. రెండు, మూడు దశల భూ సమీకరణ చేపట్టి అంతులేకుండా భూములు సమీకరిస్తోందని, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ ఇప్పటి వరకు ఊదరకొట్టి ఇప్పుడు అప్పులు తెస్తామనడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. 2029 నాటికి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి 2046 వరకు ప్రణాళికలు రూపొందించడం మాట తప్పడమే అవుతుందని తెలిపారు. ఇప్పటికే రాజధానిలో అనవసర, దుబారా ఖర్చులతో పాటు, అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా రాజధానికి నిధులివ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని, పైపెచ్చు అంచనాలు పెంచి మరిన్ని అప్పులు చేసే విధంగా, ఆస్తులను తెగ నమ్మి ప్రజలపై భారాల మోపే రీతిలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయటం గర్హనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జిఓ 1397ను రద్దు చేయాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి పారదర్శకంగా అన్ని అంశాలు చర్చించాలని, కేంద్రం నుండి నిధులు సాధించాలని డిమాండ్‌ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్