- గిరిజన గురుకులాలను యధావిధిగా కొనసాగించాలి
- ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆదివాసీ విద్యార్ధులకు నాణ్యమైన విద్య పేరుతో మారికవలసలోని గిరిజన గురుకులాలను కార్పొరేట్ కోచింగ్ సంస్థలకు అప్పగించే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గిరిజన గురుకులాల్లో చదువుతున్న పేద పిల్లలను అక్కడ నుంచి తరలించి ఫిజిక్స్‌వాలా, నారాయణ వంటి కార్పొరేట్ కోచింగ్ సంస్థలకు అప్పగించే చర్యలు దుర్మార్గమని ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్నకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఒఈ) ఏర్పాటు చేస్తామనే పేరుతో గురుకులాలను తరలించే చర్యలకు ప్రభుత్వం పూనుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. గిరిజన విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. దీనికోసం గురుకులాలను ఖాళీ చేయించి ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల బలవంతపు తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
వైద్య విద్య ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
రాష్ర్టంలో ప్రైవేటు అన్‌ఎయిడెడ్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి వైద్య విద్య ఫీజులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. యుజి వైద్య, డెంటల్ కోర్సుల ఫీజులను 10 శాతం, పిజి, సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను 15 శాతం పెంచడం వల్ల ఇప్పటికే అధిక ఫీజులతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, వారి కుటుంబాలపై మరింత ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం, ఫీజులను పెంచి విద్యను మరింత ఖరీదైనదిగా మార్చడం సరికాదని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడంతో పాటు, ప్రైవేటు కళాశాలల ఫీజులను కఠినంగా నియంత్రించాలని డిమాండ్ చేశారు. మరోవైపు PG వైద్యుల స్టైఫండ్‌ను కేవలం 3 శాతం పెంచుతూ, వారి ఫీజులను మాత్రం 15 శాతం పెంచడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.







కామెంట్‌లు (0)