- ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు
- ఆగస్టు 15 తరువాత ఉద్యమ కార్యాచరణ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
ప్రభుత్వం చర్చలు చేసి, నిర్ణయాలు ప్రకటించకుండా కావాలనే ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తుందనే భావన ఉద్యోగులలో బలపడుతోందని, కాలయాపన తగదని, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని ఎపి జెఎసి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల హక్కులు కాపాడాలని కోరారు. ఆగస్టు 15లోపు స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించకపోతే నేరుగా రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం విజయవాడ రెవెన్యూ భవన్ లో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో పాల్గోన్న సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర రావు, ఉధ్యమకమిటీ చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు మరియు జెఎసిలో ప్రధాన భాగస్వామ్య సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ జూలై 10, 11 తేదీల్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో పైనాన్సు, రెవిన్యూ, ఐఅండ్‌పిఆర్ మంత్రులు, అనంతరం, జూలై 22 న అన్ని ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు ప్రకటించక పోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రభుత్వం చర్చలు చేసి, నిర్ణయాలు ప్రకటించకుండా కావాలనే ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తుందనే భావన" ఉద్యోగులలో బలపడుతోందని తెలిపారు. ఉద్యమానికి సిద్ధమైన ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం, చర్చలు ముగిసిన పది రోజులు దాటినా ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించకపోవడం సమంజసం కాదన్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు, ప్రెండ్లీ ప్రభుత్వం అనే నినాదానికి పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి లక్షలాధి రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని, గత ప్రభుత్వం హయాంలో 28 వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయిలు పెండింగ్‌లో ఉంచిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక బకాయిలు సుమారు 25 వేల కోట్లుకు చేరుకున్నాయని తెలిపారు. పనిచేసిన కాలానికి చట్టబద్ధంగా రావాల్సిన మా సొమ్మును మాత్రమే కోరుతున్నామని పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లించాల్సిన డిఏలను రెండు సంవత్సరాలుగా ఇవ్వలేదని విమర్శించారు. పైసాఖర్చులేని 12వ పీఆర్సీ కమిషన్ నియామకంపై కూడా ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరించారు. ఆగస్టు 15లోపు ఉద్యోగుల ఆర్థిక, సేవా సమస్యల పరిష్కారంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)