ప్రజాశక్తి–హైదరాబాద్: వరకట్న వేధింపులు తాళలేక పెళ్లైన 20 రోజులకే తీవ్ర మనస్తాపానికి గురై నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పల్లవి (20) తాను చదువుతున్న కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పల్లవి ఘట్‌కేసర్ మండలం ఘనపూర్‌లోని కేపీఆర్‌ఐటీ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ ఏడాది ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డితో ఆమెకు వివాహం జరిగింది.
వివాహమైన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పల్లవి కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








కామెంట్‌లు (0)