బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మాంగనీస్’ గ్రేడ్ నిర్ధారణకు
నూతన మార్గదర్శకాలు

06 ఆగస్టు, 2026

manganees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 06:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: మాంగనీస్ ఖనిజం గ్రేడ్‌ల తప్పుడు వర్గీకరణ వల్ల కలుగుతున్న ఆదాయ నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఖనిజాన్ని గనుల ప్రాంతం నుంచి తరలించే ముందు దాని గ్రేడ్‌ను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు స్టాకింగ్, శాంప్లింగ్, రసాయన విశ్లేషణ విధానాన్ని అమల్లోకి తెస్తూ పరిశ్రమలశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానం ప్రకారం.. మాంగనీస్ ఖనిజాన్ని గరిష్టంగా 4 వేల మెట్రిక్ టన్నుల పరిమితితో, మూడు మీటర్ల ఎత్తుకు మించకుండా ప్రత్యేక ఆకృతిలో నిల్వ చేయాలి. ప్రతి స్టాక్‌ను పర్యవేక్షించేందుకు ఐపి ఆధారిత కెమెరాలు, ఎన్‌విఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసి కనీసం 45 రోజులపాటు వీడియో రికార్డులను భద్రపరచాలి. ఖనిజం తరలింపునకు ముందు లీజుదారులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా శాంపిల్ సేకరణకు దరఖాస్తు చేసుకోవాలి. గనులశాఖ నియమించిన అధికారులు యాదృచ్ఛిక పద్ధతిలో నమూనాలు సేకరించి వాటిని ప్రాథమిక, ద్వితీయ, అంపైర్ నమూనాలుగా విభజిస్తారు. ప్రాథమిక నమూనాను గుర్తింపు పొందిన ప్రయోగశాలకు, ద్వితీయ నమూనాను ప్రభుత్వ ప్రయోగశాలకు పంపించి రసాయన పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పరీక్షల ఫలితాల్లో అధిక గ్రేడ్‌ను రాయల్టీ, జిల్లా ఖనిజ నిధి, జాతీయ ఖనిజ అన్వేషణ ట్రస్ట్ తదితర చెల్లింపుల లెక్కింపునకు ఆధారంగా తీసుకుంటారు. వివాదం తలెత్తిన సందర్భంలో అంపైర్ నమూనాపై ప్రభుత్వ ప్రయోగశాల పరీక్ష ఫలితమే తుది నిర్ణయంగా పరిగణిస్తారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి 30 రోజుల్లో ప్రత్యేక వెబ్, మొబైల్ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని గనులు, భూగర్భశాఖ సంచాలకుడికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్