- 21 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
- రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాలని రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు సచివాలయాలు, మండల, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఆందోళనలను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం (కెబి భవన్) రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి (దాసరి భవన్) కెవివి ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కెబి భవన్) కె లోకనాధం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (దాసరి భవన్) ఆవుల శేఖర్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కెబి భవన్) ఎం హరిబాబు, ప్రధాన కార్యదర్శి (దాసరి భవన్) పి జమలయ్య శనివారం సంయుక్త ప్రకటనలో కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం లోటు వర్షపాతం నమోదైందని, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో 69 శాతం లోటు వర్షపాతం ఉందని తెలిపారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లలో నీరు లేక చీని, బత్తాయి, నారింజ వంటి ఉద్యాన పంటలను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల్లో విత్తనాలు వేయలేదని తెలిపారు. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్, తెలుగుగంగ, కెసి కెనాల్ ఆయకట్టులో సాగునీరు అందక వరినాట్లు పడని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కరువు కారణంగా పంటలు వేయని రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున, పంటలు వేసి నష్టపోయిన వారికి ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి కొత్త రుణాలిచ్చి, అన్ని పంటలకూ ఉచిత బీమా అమలు చేయాలని కోరారు. కౌలు రైతులు ముందస్తుగా చెల్లించిన కౌలును తిరిగి ఇప్పించాలని, పంటలు సాగుచేసిన కౌలుదారుల పేర్లను ఇ క్రాప్, ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. కరువు ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరు నెలల పాటు బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, చక్కెర, చింతపండు, కారం, పసుపు వంటి ఎనిమిది రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)