శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

1న కరువు మండలాల ప్రకటన

6 రోజుల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- అధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబరు ఒకటిన కరువు మండలాలను ప్రకటించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ – ఉద్యాన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌‌లో మొత్తం 513 మండలాల్లో కరువు నెలకొందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. వీటిలో 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగానూ, 245 మండలాల్లో మోస్తరుగానూ ఉందని వివరించారు. కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలనను వ్యవసాయశాఖ చేపడుతుందన్నారు.

ఈ నెల 24 చివరి తేదీగా నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలను 29న రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో పరిశీలిస్తారని తెలిపారు. కరువు మండలాలను గుర్తించడంతోపాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ప్రతినెలా కేంద్రానికి నివేదికలు పంపాలని నిర్దేశించారు. కరువు మండలాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఆరు శాఖల నుంచి అందే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని వర్షపాతం, పంటల సాగు పరిస్థితి, భూగర్భ జలాలు, నేలలో తేమ శాతం, శాటిలైట్ చిత్రాలు, జలాశయాల్లో నీటి నిల్వలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఉద్యాన పంటలు కాపాడటానికి ఇప్పటికే రూ.190 కోట్లు కేటాయించామని, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం అన్నారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న పంటలు హై రిస్క్ కేటగిరిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఎల్‌నినోతో 17,916 హెక్టార్లలోని నారింజ, బత్తాయి, మామిడి, ఎర్ర మిరప, ఉల్లి, కూరగాయల పంటలు ప్రభావితం కానున్నాయని తెలిపారు. నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడేందుకు మైక్రో ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం నిర్దేశించారు. రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించేలా చూడాలన్నారు.

​తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

​రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని, సమీపంలోని రిజర్వాయర్లు నింపేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టే అవకాశాలను పరిశీలించాలన్నారు. మేఘాద్రిగడ్డకు పోలవరం ఎల్‌ఎంసి నుంచి ప్యాకేజీ నెంబరు 8 కింద పైపులైన్ ద్వారా నీటిని తరలించే పనుల్లో వేగం పెంచాలన్నారు. విశాఖ నగరానికి మరో 2 నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్