- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అన్సారియా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మెగా డిఎస్సి–2025 నియామకాలు పారదర్శకంగానే జరిగాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. శాప్ ఎండి భరణితో కలిసి సచివాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియాలో కొందరు అభ్యర్థులు తమకు రావాల్సిన ఉద్యోగాలు వికలాంగ అభ్యర్థులకు కేటాయించడం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. మెరిట్, రోస్టర్ విధానం, వర్తించే రిజర్వేషన్ నిబంధనలు, ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్‌ను నిర్దేశించిన జివో 77 ప్రకారం మాత్రమే ఎంపికలు జరిగాయని తెలిపారు. వికలాంగ అభ్యర్థులకు కల్పించిన హారిజాంటల్ రిజర్వేషన్‌ను సోషల్ మీడియాలో తప్పుగా అర్థం చేసుకుని, ఎంపిక ప్రక్రియపై అపోహలు సృష్టించడం సరికాదని ఆమె పేర్కొన్నారు.డిఎస్సి-2025 ఎంపిక ప్రక్రియపై అభ్యర్థులు, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. భరణి మాట్లాడుతూ స్పోర్ట్స్ మెగా డీఎస్సీ–2025లో కొందరు అభ్యర్థుల క్రీడా ధ్రువపత్రాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అర్హత, క్రీడా మెరిట్, గుర్తింపు పొందిన క్రీడా సంఘాల ధ్రువీకరణ, ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే ఎంపికలు జరిగాయని చెప్పారు.








కామెంట్‌లు (0)