బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతీవ్ర సంక్షోభంలో విద్యా వ్యవస్థ

1 గంట క్రితం

విజయవాడ యంబివికె నిర్వహించిన విద్యవెత్తలతో చర్చగోష్టి కార్యక్రమంలో మాట్లాడుతున్.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బాధ్యతల నుంచి వైదొలుగుతున్న ప్రభుత్వాలు

  • చర్చా గోష్టిలో వ్యక్తలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి క్రమంగా వైదొలుగుతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె) ఆధ్వర్యాన బుధవారం ‘భారతదేశ విద్యా వ్యవస్థ’ అంశంపై చర్చాగోష్టి ఎంబివికె కార్యదర్శి పి మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వియ్యన్నారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన జెన్‌-జీ ఉద్యమం దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతీక అని అన్నారు. విద్యార్థుల ఆవేదనను కేవలం ఆవేశంగా చూడరాదని, విద్యా వ్యవస్థలో అవకాశాలు, సీట్ల కొరత మధ్య ఉన్న తీవ్ర అంతరాన్ని ఈ ఉద్యమం బయటపెట్టిందని తెలిపారు. ఉన్నత విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గిపోతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 497 స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీలు, 464 ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఉన్నాయని, ప్రభుత్వ రంగంలోనివి 500కు దిగువకు చేరడం రాష్ట్ర ప్రభుత్వాల నిరాసక్తతకు నిదర్శనమని విమర్శించారు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు వ్యవస్థ మొత్తం ప్రైవేటు వైపు మళ్లుతోందన్నారు. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ శాఖలు కావని, రాజ్యాంగపరమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని స్పష్టం చేసిందన్నారు. నిధుల కొరత కారణంగా విసిలు, రిజిస్ట్రార్లు గ్రాంట్ల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యావేత్త రమేష్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ.. విద్యను వ్యాపారంగా మార్చే ప్రక్రియను అడ్డుకోకుండా వ్యవస్థను బాగుచేయలేమన్నారు. ప్రభుత్వ విద్యలోనూ ఫీజులు, వసతుల విషయంలో వ్యాపార విధానాలు పెరిగాయని విమర్శించారు. పాఠ్యపుస్తకాల ముద్రణ, పాఠ్యాంశాల రూపకల్పనను కేంద్రీకరించి రాష్ట్రాలు వాటినే అమలు చేయాల్సిన పరిస్థితి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. విద్యావేత్త ఎస్‌ఆర్‌ పరిమి మాట్లాడుతూ.. నిధుల కోతతో చరిత్ర, భాషాశాస్త్రం, సోషియాలజీ, తత్వశాస్త్రం వంటి మానవీయ శాస్త్రాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. ‘ఇంగ్లీష్‌ మీడియంలో చదివితేనే మంచి విద్య’ అనే తల్లిదండ్రుల భావన సరికాదన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.. విద్యను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు విస్మరించడంతో విద్యార్థుల్లో నిరాశ పెరుగుతోందన్నారు. క్యాంపస్‌లలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ దిలీప్‌కుమార్‌, ఎఎన్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వైవి కృష్ణ, లయోలా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పిబి పాల్‌, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రత్నకమల్‌, అవనిగడ్డ పద్మ, సాయిరున్నీ బేగం తదితరులు ప్రసంగించగా, ఎంబివికె బాధ్యులు యువి రామరాజు, టి క్రాంతి పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్