ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ బృందం
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్ తదితర మైనార్టీ ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ కృషి చేస్తోందని కమిటీ చైర్మన్ మహమ్మద్ నాసిర్ అహ్మద్ తెలిపారు. అనంతపురం జిల్లాలో గురువారం ఈ కమిటీ పర్యటించింది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి మైనార్టీ విద్యార్థులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు తీరు, మైనార్టీల ఉన్నత విద్యలో ప్రవేశ వివరాలు, హాస్టల్ వసతుల కల్పన ఇతర విద్యాభివృద్ధి సంబంధిత అంశాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించింది. మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన మైనారిటీ ప్రజల నుంచి వివిధ సమస్యలతో కూడిన వినతులను కమిటీ బృందం స్వీకరించింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముహమ్మద్ నాసిర్ అహ్మద్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల స్థితిగతులపై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి ప్రభుత్వపరంగా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమం కమిటీ అధికారికంగా ఏర్పాటు అయిందని తెలిపారు. స్వీకరించిన వినతులపై కలెక్టర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించి తదుపరి ప్రభుత్వానికి ఆయా సమస్యల పరిష్కారానికి నివేదిస్తామన్నారు. ఎస్‌కెయులో మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు తదితర సమస్యలు చర్యలు అవసరమని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వక్ఫ్ ఆస్తులకు చట్టపరమైన రక్షణతో పాటు మసీదు, చర్చిలకు సంబంధించిన భూ వినియోగ ధ్రువీకరణ పత్రం రెవెన్యూ శాఖ ద్వారా మంజూరుకు, జిల్లాలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, డిఆర్ఒ మాలోలా, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ రామ సుబ్బారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)