శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం అభ్యర్థులను, మేయర్ అభ్యర్థిని గెలిపించండి : సిహెచ్.బాబురావు

1 గంట క్రితం

baburao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 05:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తెలుగుదేశం కూటమి అభ్యర్థులను ఓడించండి –

ఆటో కార్మికుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు పిలుపు

అమరావతి : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం, కమ్యూనిస్టు కార్పొరేటర్లు, మేయర్ అభ్యర్థి ఏవి వెంకటేశ్వరరావును అఖండ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ సిటీ పరిధిలోని సింగ్‌నగర్, కృష్ణా హోటల్ సెంటర్‌లో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమావేశం నిర్వహించారు. కృష్ణా హోటల్ సెంటర్‌లోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ డివిజన్లలో సిపిఎం తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులను ఆటో కార్మికులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సి.హెచ్. బాబురావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి, ఆ పార్టీలు తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడగడం కాకుండా, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. విజయవాడ నగర అభివృద్ధిపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బుడమేరు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నగరంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మంచినీటి సమస్యలు, దోమల బెడద వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో కూడా విజయవాడ నగరానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని బాబురావు అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించి కాలయాపన చేస్తోందని విమర్శించారు.

అర్హులైన పేదలందరికీ రెండు సెంట్ల ఇంటి స్థలం, ఇంటి పట్టాలు ఇస్తామని, విద్యుత్ చార్జీలు మరియు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలపై భారాలు మోపుతోందని అన్నారు. పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. టిడిపి,వైసిపి పాలనలో నగరపాలక సంస్థ బ్రష్టు పట్టిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల పక్షాన నిలుస్తున్న సిపిఎం అభ్యర్థులను మేయర్ అభ్యర్థిని విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిపించాలని బాబురావు విజ్ఞప్తి చేశారు. సిపిఐ, ప్రజా సంఘాలు బలపరిచిన సిపిఎం అభ్యర్థులకు సుత్తి,కొడవలి, నక్షత్రం గుర్తుపై, మేయర్ అభ్యర్థి ఏబి వెంకటేశ్వరరావు గుర్తు గ్యాస్ సిలిండర్ పై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం వివిధ డివిజన్లలో పోటీ చేస్తున్న సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థులను ఆటో కార్మికులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ కార్యదర్శి బి.రమణారావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె.దుర్గారావు, ఆటో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్.కె దుర్గావలి, డి.కోటయ్య కార్మికులు, సిఐటియు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్