బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముద్రగడకు కన్నీటి వీడ్కోలు

1 గంట క్రితం

mudragada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 09:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పాడె మోసిన వైసిపి అధినేత జగన్

  • అధికారిక లాంఛనాలకు అంగీకరించని కుటుంబసభ్యులు

ప్రజాశక్తి - ప్రత్తిపాడు : మాజీ మంత్రి, వైసిపి నేత ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలు బుధవారం తన స్వగ్రామం కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో నిర్వహించారు. కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన, హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగ్రామానికి బుధవారం తరలించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే, కుటుంబ సభ్యులు నిరాకరించి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.

ముద్రగడ భౌతికకాయానికి మాజీ సిఎం, వైసిపి అధినేత వైఎస్.జగన్‌‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారులు వీర రాఘవరావు, గిరిబాబులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పార్టీ పరంగా ముద్రగడ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అంత్యక్రియాల్లో పాల్గొని పాడె మోశారు.

కుమార్తెను అడ్డుకున్న కుటుంబసభ్యులు, బంధువులు

ముద్రగడకు నివాళులర్పించేందుకు ఆయన కుమార్తె క్రాంతి రావడంతో కిర్లంపూడిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రాంతి అక్కడికి రాకుండా ముద్రగడ కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. క్రాంతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. క్రాంతిని అక్కడి నుంచి పంపించేయాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు. పద్మనాభం భౌతికకాయం ఉన్న బాక్స్ ను కూడా తాకేందుకు ఆమెను అనుమతించలేదు. ఆ సమయంమలో తండ్రిని చూడలేకపోతున్నాననే బాధతో క్రాంతి తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రి మృతదేహాన్ని చివరిసారిగా చూడనివ్వాలని క్రాంతి కోరినా అనుమతించ లేదు. దీంతో ఆమె సన్నిహితులు, పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.

కిర్లంపూడికి తరలివచ్చిన అభిమానులు, ప్రముఖులు

కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. గ్రామంలోని ప్రధాన వీధులు ముద్రగడ అభిమానులతో జనసంద్రంగా మారాయి. ముద్రగడ అమర్ రహే అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ముద్రగడ అంత్యక్రియల్లో మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ఎంపీ డి.పురందేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యానందరావు, బత్తుల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, డిసిసిబి ఛైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్