తమిళనాడులో ముగ్గురు అధికారులు అరెస్టు
చెన్నై : తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సబ్-జైలులో 35 ఏళ్ల రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటనలో ముగ్గురు అధికారులను అరెస్టు చేశారు. మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో పలు గాయాలు ఉన్నట్లు వెల్లడి కావడంతో చీఫ్ వార్డర్ జెగన్ (47), వార్డర్లు శివకుమార్, తిరువుడై నంబిలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ముందుగా 'వైద్య అత్యవసర పరిస్థితి'గా నమోదైన ఈ కేసు ఇప్పడు ‘కస్టడీ మరణం’గా మారింది. ఈ కేసు పూర్తి వివరాల ప్రకారం ఈ నెల 9న దక్షిణ తమరైకుళం సమీపంలోని ఎథంకాడ్‌కు చెందిన కిరాణా దుకాణం యజమాని, వికలాంగుడు శబరి వర్మన్ ను పోలీసులు నిషేధిత గుట్కా ఉత్పత్తులు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు. అతని దుకాణం నుంచి సుమారు 200 గ్రాముల నిషేధిత పొగాకు ఉత్పత్తులు, అంటే 15 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసి, నాగర్‌కోయిల్ సబ్-జైలులో ఉంచారు. సోమవారం తెల్లవారుజామున వర్మన్‌కు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య తలెత్తడంతో అతడిని అసరిపల్లంలోని కన్యాకుమారి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పోలీసులు తరలించగా, అక్కడ వైద్యులు అతను అప్పటికే మరణించినట్లు ప్రకటించారని జైలు అధికారులు తెలిపారు. అయితే వర్మన్ మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పేర్కొన్నారు. మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించారు.







కామెంట్‌లు (0)